Hyderabad News: భారీగా అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణపై(Shiva Balakrishna) కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన్ని సర్వీస్‌ నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నారట. దీనికి సంబంధించిన న్యాయ పరమైన సలహాలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


ఇప్పుడు ఈకేసు ఒక్క శివబాలకృష్ణతో పోవడం లేదు. ఆయన దగ్గర పని చేసే అధికారుల మెడకి కూడా చుట్టుకుంటోంది. ఆయనతో పని చేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయనతో కలిసి పని చచేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చారు. వారిని విచారించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టనున్నారు. 


ఇప్పటికే శివ బాలకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన బినామి ఆస్తులు కూడా గుర్తించారు. ఇప్పుడు ఆయనతో పని చేసే ఉద్యోగులను విచారిస్తే ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. ఆయన బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ సీజ్ చేశారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 


శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్‌ విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో కాసేపట్లో తేలిపోనుంది. ఆయన్ని పది రోజుల కస్టడీకి ఇచ్చినట్టైతే.... ఆయన చేపట్టే లావాదేవీలు, బీనామీల వివరాలపై ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. ఈ దందాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ సాగనుంది. ఆయన చెప్పే సమాధానాల బట్టి మరి కొందర్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. 


మరోవైపు శివబాలకృష్ణ కారణంగా ఇబ్బంది పడ్డ వారంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. లే అవుట్‌లు వేసుకునేందుకు అనుమతుల కోసం డబ్బులు తీసుకొని పని చేయాలని వారంతా ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మధ్యే శివ బాలకృష్ణ నివాసాలు, ఆఫీస్‌లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఐదు వందల కోట్లకుపైగా అక్రమాస్తులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. తర్వాత ఆయన్ని కోర్టుకు రిమాండ్‌ విధించింది.