Ponnuru Meeting : వేలాది మంది జనం... వందల కొద్దీ మైక్‌సెట్లు...హోరెత్తించే డీజే సాంగ్‌లు...నోటిలో నుంచి మాట బయటకు రావడమే ఆలస్యమన్నట్లు జేజేలు కొట్టే కార్యకర్తలు...వీళ్లందరినీ చూసి ఒక్కోసారి తమను తామే మరిచిపోతుంటారు నాయకులు. తాము ఎక్కడ ఉన్నామో, ఏం మాట్లాడుతున్నామో, తెలియనంతగా పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అసలే ఎన్నికల కాలం...సీటుకు గ్యారెంటీ ఉందా లేదా అన్న అనుమానం...రాకరాక అధినేత తమ ఊరికి వచ్చాడు. మళ్లీ వస్తాడో రాడో కూడా తెలియదు. కాబట్టి తమ ప్రతాపమంతా ఇప్పడే చూపించి ముఖ్య నాయకుడి వద్ద మార్కులు కొట్టేయాలన్న తాపత్రయం. అధినాయకుడిని ఆకాశానికి ఎత్తేయాలన్న ఉత్సాహమో లేక మనసులో మాట ఒక్కసారిగా బయటకు వస్తుందో తెలియదు కానీ.....కీలకమైన బహిరంగ సభల్లో ఒక్కోసారి నేతలు మాట జారుతుంటారు.


తాము ఏదో ఊహించి చేద్దామనుకుంటే అదేదోఅవుతుంది. కాలుజారినా, నోరుజారినా తిరిగి వెనక్కి తీసుకోలేమంటారు...సరిగ్గా అలాంటి ఘటనే చోటుచేసుకుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu)  గుంటూరు జిల్లాలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో. చంద్రబాబును ప్రసన్నం చేసుకునే క్రమంలో మాజీమంత్రి , తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati Raja)  నోరుజారి నవ్వులు పాలయ్యారు. చంద్రబాబు(Chandra Babu)  పాల్గొన్న బహిరంగ సభలో మైకు అందుకున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌.. ఆయన్ను కీర్తిస్తూ పెద్ద ప్రసంగమే అందుకున్నారు.


కానీ పొరపాటున జగన్ (Jagan) అభివృద్ధి, విజనరీ పాలన సూపర్ అంటూ కితాబివ్వడంతో సభకు హాజరైన తెలుగు తమ్ముళ్లతోపాటు చంద్రబాబు సైతం అవాక్కాయ్యారు. 'రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే.. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా.. సమర్థత ఉన్నది సీఎం జగన్ కు మాత్రమే' అంటూ ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం సృష్టించాయి. అయితే ఆయన వెంటనే నాలుకకర్చుకుని జరిగిన తప్పిదాన్ని గుర్తించారు.


చంద్రబాబు( Chandra Babu)ను పొగడ్తలతో ముంచెత్తుదామనుకుని ఆ ప్లేస్‌లో పొరపాటున జగన్( Jagan) పేరు ఉచ్చరించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైకాపా అనుకూల బృందం ఈ క్లిప్‌ను తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతూనే ఉన్నారు. ఆయన పొరపాటున ఆ వ్యాఖ్యలు చేయలేదని...ఆలపాటి రాజా(Aalapati Raja) మనసులో మాటే బయటకు చెప్పారంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.


వైకాపా నేతలు చెబుతున్న మాటలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఆలపాటి రాజా గతంలో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ...తెనాలిలోనే ఉంటూ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా శక్తి వంచన లేకుండా నిర్వహించారు. అమరావతి ఉద్యమం మొదలుకుని అనేక కార్యక్రమాలను సొంతంగా చేపట్టారు. జిల్లాలో సీనియర్ నేతగా ఉండటంతోపాటు....తెనాలిలో తెలుగుదేశం తరఫున పోటీకి మరో అభ్యర్థి లేకపోవడంతో రాజాతోపాటు తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఈసారి సీటు ఆయనకేనని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా గెలిచే తొలిసీటు తెనాలేనని తెలుగుదేశం నేతలు  చెబుతూ వస్తున్నారు.


అయితే తెలుగుదేశం-జనసేన పొత్తుతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. జనసేనలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్‌ది తెనాలే. కాబట్టి కచ్చితంగా ఆయనకు పొత్తులో భాగంగా తెనాలి సీటు కేటాయించాల్సిందే. ఇటీవలే ఆయన తెనాలిలో కార్యాలయం ప్రారంభించి ప్రచారం సైతం చేస్తున్నారు. తెనాలి నుంచి తానే పోటీలో ఉండనున్నట్లు ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో ఆలపాటి రాజా సీటుకు ఎసరొచ్చినట్లు అయ్యింది. తెనాలి సీటు తెలుగుదేశానికే కేటాయించాలంటూ ఈమధ్య ఆయన కొంత అలకబూనారు. పార్టీ శ్రేణులు సైతం ఆందోళనకు దిగాయి. ఆలపాటి రాజా పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఆయన బహిరంగ సభ వేదికపై కావాలనే జగన్‌ను పొగిడారంటూ వైకాపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.


ఇలా బహిరంగ సభలు, వేదికలపై నోరుజారడం, ఆ తర్వాత సరిచేసుకోవడం కొత్తేమి కాదు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నోసార్లు...నిజం చెప్పాలంటే ఆయన ప్రతి బహిరంగ సభలోనూ నోరు జారడం లేదా పదాలు పలక లేక తడబడిపోవడం పరిపాటే. ఇక చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ సైతం ఎన్నోసార్లు ఈ విధంగా తడబడ్డారు. కానీ వారంతా చిన్న చిన్న పదాలు అటు,ఇటుగా మాట్లడం వల్ల పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఆలపాటి రాజా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతున్నాయి. ఆ మధ్య కాలంలో వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం అసెంబ్లీ ఇదే విధంగా ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పి అబాసుపాలయ్యారు. మంత్రి రోజా సైతం గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబును ముఖ్యమంత్రి అంటూ సంభోధించి వెంటనే సర్దుకున్నారు.