దళితబంధు పథకంపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలకు సన్నద్ధం అవుతోంది. ఇప్పటి వరకూ వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలుచేశారు. రాష్ట్రంలోని మరో నాలుగు మండలాల్లో దళితబంధు అమలుచేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం తరహాలో రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారుల చొప్పున పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. 


Also Read: ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు అమానుషం.. ఓ మహిళను వివస్త్రను చేసి దాడికి యత్నం


కలెక్టర్లతో సీఎస్ సమీక్ష


దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పథకం అమలుపై కలెక్టర్లతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. దళితబంధు అమలుకు సంబంధించి సీఎస్ కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.


Also Read: హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మాస్కో తరహాలో హుస్సేన్ సాగర్‌పై త్వరలోనే వేలాడే వంతెన


118 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు


రాష్ట్ర వ్యాప్తంగా 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళితబంధు అమలుకు నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీఎస్ ఆదేశాలు జారీచేశారు. మార్చి నెలలోగా నియోజకవర్గాల్లో 100 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేల సూచలనతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులతో ఆమోదించుకోవాలని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి రూ. 10 లక్షల ఆర్థిక సాయంతో కోరుకున్న యూనిట్‌ను ఎంపిక చేయాలన్నారు. లబ్దిదారుడికి మంజూరు చేసిన రూ. 10 లక్షల నుంచి రూ.10 వేలతో దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు కేటాయించామని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ఈ నిధుల్లో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతా నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని సీఎస్‌ వివరించారు.


Also Read: కరోనా పెళ్లిళ్లలో జొమాటో విందులే కాదు.. "ఒక్క కర్రీ" భోజనాలు కూడా ఉంటాయ్ ! వేములవాడలో వీళ్లు తీసుకున్న నిర్ణయం ఇదీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి