కరోనా కారణంగా పెళ్లిళ్లకు రావాలని అడగలేకపోతున్నాం.. విందు భోజనం ఇంటికే పంపుతున్నామన్న ఘటనల గురించి వింటున్నాం.. కానీ కాయిన్‌కు రెండో సైడ్ కూడా ఉంటుంది. కరోనా వల్ల అతిధుల్ని ఆహ్వానించి.. పసందైన విందు అందించలేని వారు ఉంటారు. కరోనా ఎంతో మంది ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టింది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతికి చెందిన వాళ్లే ఉంటారు. అలాగని పిల్లల బాధ్యతలను పూర్తి చేయకుండా ఉండలేరు. ఇలాంటివారికే పెద్ద చిక్కొచ్చి పడింది. అందరూ ఏదో ఒకటి అని అప్పులు చేసి.. తాహతుకు మించి పెళ్లిళ్లు చేసేస్తూంటారు.
Also Read: హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మాస్కో తరహాలో హుస్సేన్ సాగర్‌పై త్వరలోనే వేలాడే వంతెన
కానీ పిల్లల పెళ్లిళ్ల అప్పులు ఆ తర్వాత పెనుభారంగా మారుతాయి. ఈ విషయాన్ని వేములవాడ ముస్లిం పెద్దలు గుర్తించారు. కొంత మంది పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు గమనించారు. అందరికీ సాయం చేయడం సాధ్యం కాదు.. అలా చేయడం పరిష్కారం కూడా కాదు. అందుకే .. ఏం చేయాలా అని ఆలోచించి.. ఖర్చులు తగ్గించుకోవడమే పరిష్కారం అని నిర్ణయానికి వచ్చారు. అందరూ కలిసి కట్టుగా ఉండేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
పెళ్లిలో వీలైనంత తక్కువ ఖర్చు చేయాలని ... ముఖ్యంగా ఆహారం విషయంలో ఎక్కడా వృధా ఉండకూడదని భావించారు. సాధారణంగా ముస్లిం పెళ్లిల్లో ఐదారు రకాల మాంసాహారం, బిర్యానీలు, స్వీట్స్ అందుబాటులో ఉంటాయి. ఓ అతిధి అన్నింటినీ రుచి చూడలేడు కూడా. అందుకే వేస్టేజీ కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి బగారా రైస్, చికెన్ లేదా మటన్ కర్రీ, ఓ స్వీట్ మాత్రమే పెళ్లిళ్లలో వడ్డించాలని నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల పెళ్లి ఖర్చు సగానికిపైగా తగ్గిపోతుందని అంచనాకు వచ్చారు.
వేముల వాడ ముస్లిం పెద్దల అలోచనలకు అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమ ఇళ్లల్లో పెళ్లి చేయాలనుకుంటే ఆ పద్దతిలోనే ఫాలో అవ్వాలని డిసైడయ్యారు. పెళ్లి అంటే ఉన్నదాని కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసుకోవడం కాదని.. ఉన్నదాంతో ఆనందంగా చేసుకోవడం అని నిరూపించాలని అనుకుంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటే వేములవాడ ముస్లింలలో అప్పుల పాలయ్యేవాళ్లు తక్కవే ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.