పొయ్యిలో కట్టెలు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మహిళలను దాడి చేయడంతోపాటు వివస్త్రను చేసి కొట్టారంటూ బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగు సమీపంలో ఇటీవల చత్తీస్‌ఘడ్‌ నుంచి వలస వచ్చిన కూలీలు నివాసముంటున్నారు. నలుగురు మహిళలు పొయ్యిలో కట్టెలు తెచ్చుకునేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు.


అటువైపుగా వచ్చిన ఫారెస్ట్‌ గార్డులు వీరిపై దాడి చేశారు. దీంతో భయంతో నలుగురు మహిళలు పరుగులు పెట్టారు. ఇందులో ఒక మహిళ పరిగెడుతూ గుంతలో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మిగిలిన ముగ్గురిలో ఒక మహిళపై తీవ్రంగా దాడి చేశారని, వివస్త్రను చేసి దాడి చేశారని బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విచారణ చేసి ఆదివాసీ మహిళలపై దాడులకు పాల్పడిన అటవీశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని న్యూడెమోక్రసీ పార్టీ పాల్వంచ డివిజన్‌ కమిటీ నాయకులు కుంజా కృష్ణ డిమాండ్‌ చేశారు.
వలస కోయలపై తరుచూ దాడులు..
గత 5 ఏళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దు ప్రాంతానికి చెందిన గొత్తి కోయలు వలస వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అటవీ సమీపంలోనే వీరు ఉండటంతో గతంలో తరుచుగా ఫారెస్ట్‌ అధికారులు వలస గొత్తి కోయలపై దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులకు పోలీసులకు మద్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో వీరంతా వలస వచ్చారు. ఇలా వలస వచ్చిన గొత్తి కోయలు సమీప గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


అయితే పోడు కొడుతున్నారనే అనుమానంతో గతంలో పారెస్ట్‌ అధికారులు వీరిపై దాడులకు పాల్పడ్డారు. ఈ విషయంపై గతంలో న్యూడెమోక్రసీతోపాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు సాగడంతో ఇటీవల వీరిపై దాడులు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రస్తుతం ములకలపల్లి సంఘటనతో మరోసారి వలస గొత్తి కోయలపై ఫారెస్ట్‌ అధికారులు దాడులకు పాల్పడటం మరోసారి చర్చగా మారింది. బతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీలపై వేధింపులకు పాల్పడటం సరికాదని వామపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఉపాధి కోసం వచ్చిన వీరు కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వీరిపై దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మహిళలపై దాడులకు పాల్పడటంతోపాటు ఓ మహిళలను వివస్త్రను చేసి దాడికి పాల్పడటం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది.


Also Read: BTech Student Suicide: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!


Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు


Also Read: Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి