తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు... ఆయన్ని అరెస్టు చేశారు. అనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. బెయిల్ విడుదలైన బండి... తనకు అవమానం జరిగిందని జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు.
ఎంపీ బండి ఫిర్యాదు మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని అరెస్టుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ.
తెలంగాణ డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీకి కూడా లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది.
ఈ మధ్యకాలంలోనే జాతీయ బీసీ కమిషన్ కూడా స్పందించింది. కరీంనగర్ పోలీసులను పిలిచి విచారించింది. పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న వ్యక్తిని తలుపులు పగలగొట్టి అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది.
ఈ మధ్య కరోనా నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేస్తున్నారని బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌కు కూడా తరలించారు. ఇదే తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. జాతీయ స్థాయి నాయకులు వచ్చి బండి సంజయ్‌కు సంఘీభావం తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.