Telangana Government Ban On Gutka And Pan Masala: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి ఏడాది కాలం పాటు వీటిపై నిషేధం, నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు.. గుట్కా, పాన్ మసాలాల్లో ఉండడంతో వాటిని నిషేధించినట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. నిబంధనలు మీరి గుట్కా తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు, రాష్ట్రంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిశుభ్రత, నిల్వ ఉంచిన ఆహారం గుర్తించి ఆయా హోటళ్ల నిర్వాహకులపై చర్యలు చేపట్టారు.


మిరియాల పేరుతో పుప్పొడి విత్తనాలు


అటు, కరీంనగర్‌లోని పలు హోటళ్లపైనా ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వరంగల్ నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీతో పాటు.. పలువురు అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఆకస్మికంగా చేసిన దాడులతో.. ఒక్కసారిగా హోటల్స్ యాజమాన్యాలు బెంబేలెత్తాయి. మిరియాల పేరుతో పుప్పొడి గింజలను వేస్తున్నట్టు గుర్తించారు. 2021- 22 సమయంలోని ఇన్ గ్రీడియంట్స్‌ను మసాలాలుగా వాడుతుండటం గుర్తించిన అధికారులు షాకయ్యారు. కల్తీ నూనెలు, కాలం చెల్లిన వంట సామాగ్రి, మసాలాలు గుర్తించి హోటల్ యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: Hyderabad News: తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని వ్యక్తి భార్య కిడ్నాప్ - బాధితురాలిని రక్షించిన పోలీసులు