Family Kidnapped Man Wife In Hyderabad: ఓ వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగి నుంచి రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఏళ్లు గడిచినా ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో విసిగిపోయిన బాధితుడు తీసుకున్న డబ్బులైనా తిరిగి ఇవ్వాలని సదరు వ్యక్తిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే, ఆ డబ్బు ఇచ్చేందుకు తిప్పిస్తుండడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబసభ్యులతో కలిసి అతని భార్యను కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లా సూరారం ఠాణా పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు (Kurnool) జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావుతో హైదరాబాద్‌కు చెెందిన ఎలిజబెత్ రాణికి 19 ఏళ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో సుందర్ నగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.


ఉద్యోగం ఇప్పిస్తానని..


లక్ష్మణరావు భార్య రాణి స్థానికంగా ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నారు. కాగా, లక్ష్మణరావు ఏడేళ్ల క్రితం ఓయూ ప్రాంతంలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకున్నాడు. అయితే, లక్ష్మణరావు దందా బయటపడడంతో పై అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, ఏడేళ్లుగా తనకు ఉద్యోగం ఇప్పించకపోవడంతో వెంకటేశ్..లక్ష్మణరావు తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. రేపు మాపు అంటూ తిప్పించుకోవడంతో వెంకటేశ్, మరో ఇద్దరు మహిళలు కలిసి శనివారం ఎలిజిబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రాణి తన పిల్లలకు ఫోన్ ద్వారా తెలియజేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేశ్ ఇంటికి వెళ్లి రాణిని విడిపించారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై విచారణ చేస్తున్నారు.  అయితే, లక్ష్మణరావు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారని.. శనివారం డబ్బులు తిరిగి ఇస్తామంటే అతని ఇంటికి వెళ్లామని ఇద్దరు మహిళలు చెబుతున్నారు. తాము ఇంటికి వెళ్లేసరికి లక్ష్మణరావు లేడని.. దీంతో రాణిని స్నేహపూర్వకంగానే తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.


Also Read: Karimnagar పోలీసుల అత్యుత్సాహం, హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములపై దౌర్జన్యం! బండి సంజయ్ ఆగ్రహం