Hero Indhra Ram Interview: ''ముందు విజయ్ సేతుపతి గారు 'చౌర్య పాఠం' టీజర్ విడుదల చేయడానికి మాకు ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. టీజర్ చూశాక ఆల్మోస్ట్ 45 నిమిషాలు మాట్లాడారు. టీజర్ గురించి, నా నటన గురించి మాట్లాడారు. వ్యక్తిగతంగా నన్ను ప్రశంసించారు. మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ చేశానని చెప్పారు. అంత గొప్ప నటుడి నుంచి వచ్చిన ప్రశంసలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను'' అని ఇంద్ర రామ్ సంతోషం వ్యక్తం చేశారు.
'చౌర్య పాఠం' (Chaurya Paatam Movie)తో ఇంద్ర రామ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... టాప్ సినిమాటోగ్రాఫర్, 'ఈగల్' దర్శకుడు, ప్రస్తుతం 'మిరాయ్' తెరకెక్కిస్తున్న కార్తీక్ ఘట్టమనేని కథ అందించారు. ఆ కథ నచ్చిన 'ధమాకా' దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారారు. ఇంద్ర రామ్ తొలి సినిమా వెనుక ఇద్దరు అగ్ర దర్శకులు ఉన్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా గురించి హీరో చెప్పిన విశేషాలు...
- నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చాను. నటనలో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నా. చాలా ఆఫీసులు చుట్టూ తిరిగా. పలువురు దర్శకుల్ని కలిశా. చాలా రిజెక్షన్స్ చూశా. చివరకు, నేను ఎదురు చూసిన అవకాశం త్రినాథరావు నక్కిన, కార్తీక్ ఘట్టమనేని రూపంలో ఎదురైంది. 'చౌర్య పాఠం' సినిమాలో అవకాశం వచ్చింది. అందుకు, నేను వాళ్లిద్దరికీ ఎంత కృతజ్ఞత చూపించినా తక్కువే.
- 'చౌర్య పాఠం' నాకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ప్రతిభావంతులైన ఇద్దరు దర్శకులు అండగా ఉండటంతో వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ మేకింగ్ ప్రాసెస్ లో ఎన్నో విషయాలు అర్థం అయ్యాయి. సినిమా కోసం రెండేళ్లు కేటాయించా. మా టీం అంతా ఎంతో కష్టపడ్డాం. అందుకు తగ్గ ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నాను.
- 'చౌర్య పాఠం' కథ కొత్తగా ఉంటుంది. ఇదొక యూనిక్ స్టోరీ. కథలో యూనిక్ పాయింట్ నచ్చి త్రినాథరావు నక్కిన గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ల దగ్గర పలువురు హీరోల డేట్స్ ఉన్నాయి. అయినా... ఆడిషన్స్ చేసిన తర్వాత ఆ హీరో పాత్రకు నేను బావుంటానని నన్ను ఎంపిక చేశారు. నా దృష్టిలో ఎప్పుడూ కథే హీరో. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ కొత్తదనం ఉండటంతో ఈ సినిమా చేశా. 'చౌర్య పాఠం' చూసేటప్పుడు కథలో పాత్రలతో పాటు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు.
Also Read: బేబీ లీక్స్... సాయి రాజేష్ వెన్నుపోటుపై శిరిన్ శ్రీరామ్ బుక్!
- 'చౌర్య పాఠం' సినిమాకు ముందు కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే... ఆ కథలు రొటీన్ అనిపించడంతో చేయలేదు. రెగ్యులర్ ప్యాట్రన్ సినిమాలు చేయాలని నేను తొందర పడటం లేదు. యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా నెక్స్ట్ సినిమా పెద్ద నిర్మాణ సంస్థలో ఉంటుంది. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తా.
- సినిమా అంటే నాకు ప్రేమ కాదు, అదే నా జీవితం. యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాక ఇండస్ట్రీలోకి వచ్చాను. నన్ను సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండటం నా అదృష్టం. ఓర్పు, సహనంతో వేచి ఉండటమే అసలైన శక్తి అని నేను నమ్ముతా. మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని వేచి చూస్తున్నా.
Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై విష్ణు మంచు ట్వీట్... నటి హేమపై అప్పుడు చర్యలు తీసుకుంటామని వెల్లడి