Anasuya Sengupta: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడవాలని ఎంతోమంది నటీనటులకు కోరిక ఉంటుంది. అలాంటిది అంత పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్‌లో తమ సినిమా ఫీచర్ అవ్వడం, అవార్డ్ దక్కడం అనేది మామూలు విషయం కాదు. 77 ఏళ్ల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో మొదటిసారి ఒక ఇండియన్ నటికి బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డ్ దక్కింది. అనసూయ సేన్‌గుప్తా అనే ఇండియన్ నటి కేన్స్‌లో రికార్డ్‌ను క్రియేట్ చేశారు. మామూలుగా ప్రతీ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ని కేటగిరిల్లో ఇండియన్స్ పోటీపడతారు. కానీ అందులో చాలా తక్కువమందికి మాత్రమే అవార్డులు దక్కుతాయి. ఆ లిస్ట్‌లో ఇప్పుడు అనసూయ చేరారు.


ఒక వేశ్య కథ..


అనసూయ సేన్‌గుప్తా కోలకత్తాకు చెందిన నటి. ‘ది షేమ్‌లెస్’ అనే సినిమాలో తన నటనకు 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డ్ అందుకున్నారు అనసూయ. ఈ సినిమాను బల్జేరియన్ ఫిల్మ్ మేకర్ కోన్‌స్టానిన్ బోజానోవ్ డైరెక్ట్ చేశారు. ‘ది షేమ్‌లెస్’ కథ మొత్తం రేణుక అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఢిల్లీలోని వేశ్యగృహంలో పనిచేసే తను.. ఒక పోలీస్ ఆఫీసర్‌ను హత్య చేసి అక్కడి నుండి తప్పించుకుంటుంది. వేశ్య పాత్రలో అనసూయ సేన్‌గుప్తా నటనకు కేన్స్ జ్యూరీ సైతం ఫిదా అయ్యింది. అందుకే తనకు ఈ అవార్డ్ దక్కింది. కేన్స్‌లో పలు కేటగిరిల్లో ఇండియన్స్‌కు అవార్డులు దక్కాయి. కానీ బెస్ట్ నటి కేటగిరిలో ఒక ఇండియన్‌కు అవార్డ్ రావడం మాత్రం ఇదే మొదటిసారి.


అదే రియాక్షన్..


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సెర్టెయిన్ రిగార్డ్ సెక్షన్‌లో ‘ది షేమ్‌లెస్’ సినిమా ఫీచర్ అయ్యింది. ఈ విషయం మొదటిసారి విన్నప్పుడు తన రియాక్షన్ ఏంటో బయటపెట్టారు అనసూయ సేన్‌గుప్తా. ‘‘కేన్స్ అధికారిక సెలక్షన్స్‌కు సంబంధించిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లింక్‌ను కోన్‌స్టానిన్ నాకు షేర్ చేశాడు. అందులో మా సినిమా పేరు అనౌన్స్ చేయగానే నేను ఆనందంలో ఎగిరి గుంతులేశాను’’ అని చెప్పుకొచ్చారు అనసూయ. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ రెడ్ కార్పెట్‌పై నడిచిన ఇండియన్ సెలబ్రిటీల సంఖ్య ఎక్కువ అవ్వడం ఒక ఎత్తు అయితే.. ఇదే ఏడాది ఒక ఇండియన్ నటికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ దక్కడం మరో ఎత్తు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


మరో రెండు సినిమాలు..


‘ది షేమ్‌లెస్’తో పాటు మరో రెండు ఇండియన్ సినిమాలు కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లా సినీఫ్ సెలక్షన్ కేటగిరిలో అవార్డులను దక్కించుకున్నాయి. అవే ‘సన్‌ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’, ‘బన్నీహుడ్’. ‘సన్‌ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ అనేది ఒక కన్నడ షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ అయిన చిదానంద నాయక్ డైరెక్ట్ చేశాడు. ‘బన్నీహుడ్’ అనే సినిమాను మాన్సి మహేశ్వరి డైరెక్ట్ చేశారు. తను ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన అమ్మాయి అయినా ప్రస్తుతం యూకేలో చదువును కొనసాగిస్తున్నారు. మే 25న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగుస్తుంది.


Also Read: డెకరేషన్ ఐటెమ్స్‌తో డ్రెస్ కుట్టించారా? ఐశ్వర్య రాయ్ కేన్స్ లుక్‌పై విమర్శలు