Vishnu Manchu On Actress Hema Rave Party Issue: బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు ఉందని వార్తలు రాగా... ఆమె ఖండించారు. తాను హైదరాబాద్ సిటీలో ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నానని వీడియో విడుదల చేశారు. అనంతరం పోలీసులు ఆ వీడియో బెంగళూరులో షూట్ చేశారని లొకేషన్ ఫోటోలు విడుదల చేయడంతో పాటు హేమ ఉన్నారని, తమ రికార్డుల్లో అసలు పేరు కృష్ణవేణిగా నమోదు చేశారని వివరించారు. హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుంచి తొలగించాలని 'కరాటే' కళ్యాణి వంటివారు డిమాండ్ చేశారు. ఈ వివాదంపై 'మా' ప్రెసిడెంట్ విష్ణు మంచు ఇవాళ స్పందించారు.
హేమపై నిరాధారమైన ఆరోపణలు వద్దు
''బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన డ్రగ్ కేసులో కొన్ని మీడియా సంస్థలు, కొంత మంది వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ నిర్ధారణకు వచ్చే ముందు, నిజనిర్ధారణ చేయనటువంటి సమాచారం వ్యాప్తి చేసే ముందు కాస్త సంయమనం పాటించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హేమ దోషి అని తేలేవరకు ఆమెను నిర్దోషిగా పరిగణించాలి. ఆవిడ ఒక అమ్మాయికి తల్లి, ఒకరి భార్య. పుకార్లను ఆధారం చేసుకుని ఆవిడ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం, ఆమెను దూషించడం తగదు'' అని విష్ణు మంచు సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
Also Read: హేమ మూవీల్లోనే ట్రెడిషనల్, బయట బాగా మోడ్రన్... జీన్స్ వేసి లండన్‌లో షికారు చేసిన ఫోటోలు
హేమ దోషిగా తేలితే చర్యలు తప్పవు. కానీ...
హేమపై నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని విజ్ఞప్తి చేసిన విష్ణు మంచు... అదే సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association - MAA) చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. హేమ విషయంలో పోలీసులు ఖచ్చితమైన సాక్ష్యాలను అందిస్తే 'మా' తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అప్పటివరకు ఎటువంటి అధరాలు లేని వార్తలను సంచలనం చేయవద్దని తెలిపారు.
హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, యాంకర్ శ్యామల మీద సైతం రేవ్ పార్టీకి అటెంట్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే... తమకు, ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వారు వీడియోలు విడుదల చేశారు. తాను వివరణ ఇచ్చిన తర్వాత సైతం తనకు నోటీసులు ఇచ్చినట్టు కొందరు వార్తలు ప్రసారం చేస్తున్నారని, అటువంటి వార్తలు ప్రసారం చేసిన వారికి తాను నోటీసులు ఇస్తానని శ్రీకాంత్ సున్నితంగా హెచ్చరించారు.
Also Read: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ - విశ్వక్ సేన్ మాస్, ఎవడైనా మీదకొస్తే పులిలా మీద పడిపోవడమే!