Vishwak Sen's Gangs Of Godavari Trailer Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. మే 31న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్‌ సిటీలోని దేవి 70 ఎంఎం థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ ట్రైలర్ విడుదల చేశారు. 


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఎలా ఉందంటే?
'మనుషులు మూడు రకాలు రా! నాసి రకం. రెండోది...  బోసి రకం. మూడోది... నాణ్యమైన రకం' అని నటుడు గోపరాజు రమణ చెప్పే మాటతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ మొదలైంది. నాసి రకం అన్నప్పుడు తాగుతూ పేకాడుకుంటున్న సామాన్య ప్రజలను చూపించారు. బోసి రకం అన్నప్పుడు రాజకీయ కార్యకర్తలు, ఛోటా మోటా నాయకులను చూపించారు. నాణ్యమైన రకం అన్నప్పుడు రాజకీయ నాయకుడిగా గోపరాజు రమణను చూపించారు. నాజర్ మరో నాయకుడి పాత్ర చేసినట్టు అర్థం అవుతోంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ. 


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. యువ నాయకుడు రత్న అంటే బలంగా రాయమని 'హైపర్' ఆదితో చెబుతాడు హీరో. ఆ తర్వాత అంజలి, నేహా శెట్టిలను చూపించారు. నేహాతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నట్టు చూపించారు. 
'నా ఊరిలో నాకేటి భయం' అనే రకం హీరో. అతడి మీద పోలీసులు ఎందుకు అరెస్ట్ వారెంట్ విడుదల చేశారు? 'ఈ సమస్య వాడు పొతే వాడితో పోద్ది' అని నాజర్, ఆ తర్వాత 'లేదంటే ఊరే పోద్ది' అని మరో నటుడు ఎందుకు చెప్పారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. 'నేను నీలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే... మన మీదికి ఎవడైనా వస్తే వాడి మీదికి పడిపోవడమే' అని చెప్పే మాటలో హీరో క్యారెక్టరైజేషన్ చెప్పారు దర్శకుడు కృష్ణచైతన్య. 


'మనుషులు మూడు రకాలు... ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు' అని ట్రైలర్ చివరలో హీరో చెప్పే డైలాగ్ గోపరాజు రమణ పాత్రకు కౌంటర్ అన్నమాట. అన్నట్టు... ఇందులో హీరో నోటి వెంట కొన్ని బూతు మాటలు సైతం అలవోకగా వచ్చేశాయి. బహుశా... రా అండ్ రస్టిక్ నేపథ్యంలో సినిమా తీయడం, హీరో పాత్రను దృష్టిలో పెట్టుకుని అలా రాశారేమో!? ట్రైలర్ అంతటా యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బావుంది.


Also Read: మోహన్ లాల్ రీమేకు, తెలుగులో హిట్టు  - చిరు, వెంకీ కంటే మోహన్ బాబు, నాగార్జునే ఎక్కువ చేశారుగా



గోదావరి జిల్లాలో సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తిగా 'లంకల' రత్న పాత్ర ఉంటుందని, అతని జీవిత ప్రయాణమే సినిమా అని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని విశ్వక్ సేన్ విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు.


Also Read: పెళ్ళాం ఫర్నీచర్, ఫిగర్ పెర్ఫ్యూమ్ - రష్మీతో భాస్కర్ కామెడీ, 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో అరాచకం