BJP MP Bandi Sanjay condemn behaviour of police against Hanuman Deeksha Swamis | కరీంనగర్‌: హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని వందల అడుగులు వాహనంతో లాక్కెళ్లారు పోలీసులు. ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరిగింది. సమచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. కరీంనగర్‌లో హనుమాన్ మాలదారులు కొందర్ని పోలీసులు అరెస్టు చేయగా.. మరో హనుమాన్ మాలధారుడ్ని పోలీసులు వాహనంతో లాక్కెళ్లడం వివాదాస్పదం అవుతోంది.


పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ హనుమాన్ మాలదారులు నిరసనకు దిగగా, బీజేపీ నేతలు వారికి మద్దతుగా వెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీచార్జ్ (Karimnagar police doing Lathi Charge on people) చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసినట్లు తెలుస్తోంది. దీక్షలో ఉన్న స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.




పోలీసుల తీరును ఖండించిన బండి సంజయ్
కరీంనగర్‌లో హనుమాన్ మాలదారులపై పోలీసుల తీరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లో హనుమాన్‌ దీక్షా స్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ మండిపడ్డారు.  పోలీసులు అరెస్ట్ చేసిన హనుమాన్ దీక్షా స్వామీజీలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  పోలీసుల పని శాంతి భద్రతలను కాపాడటం, సమస్యలను సృష్టించడం కాదని సూచించారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బదులు కరీంనగర్ పోలీసులు ప్రజలపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారని, దయచేసి నిజాలను గుర్తించి, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తాను బండి సంజయ్ కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


కరీంనగర్ పట్టణంలో ర్యాలీ సందర్భంగా వివాదం.. 
కరీంనగర్ పట్టణంలో కొందరు హనుమాన్ దీక్ష స్వాములు ర్యాలీ చేశారు. అయితే ఓ వ్యక్తి వచ్చి తల్వార్ తిప్పడం, వేరే తీరుగా వ్యవహరించడంతో హనుమాన్ దీక్షాపరులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిపై దురుసుగా ప్రవర్తించారు. మాలలో ఉన్నారని కూడా చూడకుండా దీక్షాపరులపై నోటికొచ్చినట్లు మాట్లాడారని బండి సంజయ్ తెలిపారు. అక్కడ ఏం గొడవ జరిగిందన్నది పక్కనపెడితే, మాలలో ఉన్న ఓ స్వామి వాహనాన్ని పట్టుకుని ఉండగా, కొంతదూరం లాక్కెళ్లినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు గొడవలు జరగకుండా అడ్డుకోవాలన్నారు. ర్యాలీలో తల్వార్ తిప్పిన వ్యక్తిని అడ్డుకుంటారు కానీ, బాగా తిప్పావని ఎవరూ మెచ్చుకోరని ఎంపీ అన్నారు.


పోలీసులకు సహకరిస్తాం, స్వాములను విడుదల చేయాలి 
గతంలో పలు ఘటనలు జరిగితే తాము పోలీసులకు సహకరించినట్లు గుర్తుచేశారు. తమ సహనాన్ని తప్పుగా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కానీ కొందరు పోలీసులు స్వామీజీలు బూతులు మాట్లాడారంటూ దుష్ప్రచారం చేయడంపై మండిపడ్డారు. ఏ స్వామిలు దుర్భాషలాడరని ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు. అరెస్ట్ చేసిన హనుమాన్ స్వామీ దీక్షాపరులను బేషరతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము కూడా చట్టబద్ధంగా వెళ్లి స్వాములకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.