TS Congress : తెలంగాణలో కాంగ్రెస్ లో కుమ్ములాటలు కొత్తకాదు. ఎప్పుడూ ఏదో అంశంపై పార్టీలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఇటీవల అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వివాదం కాస్త చల్లబడింది అనుకునే లోపే మళ్లీ ఆజ్యం పోశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూరే కారణమని విమర్శలు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ పై ఆ పార్టీ నేత రేణుకా చౌదరి స్పందించారు.  


శశిధర్ రెడ్డి ఓపికగా ఉంటే వ్యక్తి -రేణుకా చౌదరి 


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎప్పుడూ ఓపికగా ఉండే వ్యక్తి అని రేణుకా చౌదరి అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.  మర్రి శశిధర్ మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారన్నారు. శశిధర్ రెడ్డి సమస్య సర్దుకుంటుందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని రేణుకా చౌదరి సూచించారు. పార్టీలో తమని అవమానించే వారు ఎవరూ లేరన్నారు. అవమానిస్తే దుమారం ఎలా లేపాలో తనకు తెలుసన్నారు. ఖమ్మంలో తనను ఎదుర్కొనే మొనగాడు లేడని రేణుకా చౌదరి తెలిపారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లడం బాధాకరమన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఇలాంటివి సహజమే అన్నారు. బీజేపీలో కూడా నేతల మధ్య విబేధాలు ఉన్నాయని రేణుకా చౌదరి స్పష్టంచేశారు. 


సీనియర్లు ఆలోచించి మాట్లాడాలి- అద్దంకి 


తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూరే కారణమని ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ స్పందించారు. పీసీసీ, పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. తాము చేసిన వ్యాఖ్యలను పెద్దవి కాకుండా సద్దుమణిగే విధంగా చేయాల్సిన నేతలు, పార్టీకి సలహాలు ఇవ్వాల్సిన సీనియర్లు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ చేస్తున్న కుట్రల్లో కాంగ్రెస్‌ నేతలు పావులుగా మారుతున్నట్లుగా అనిపిస్తోందని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఏదైనా ఉంటే చూసుకోవడానికి పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీలు చూసుకుంటాయన్నారు.  


రేవంత్ రెడ్డి, మాణికం ఠాగూర్ పై ఆరోపణలు 


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి, మాణికం ఠాగూర్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారని విమర్శించారు.  అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగేలా పనిచేయాల్సిన మాణికం ఠాగూర్‌.. రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు పార్టీకి నష్టం చేసిందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.  అయితే మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్న ఇరువురు నేతలు సోనియాను కలిసి పార్టీ పరిస్థితులపై వివరించనున్నట్లు సమాచారం. 


Also Read : Bandi Sanjay : భౌతిక దాడులు ఖాయం - బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక !


Also Read : Bandla Ganesh On Bjp : బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు, అక్కడ పుట్టిఉంటే బండ్లానీ అయ్యేవాడిని - బండ్ల గణేష్