Bandla Ganesh On Bjp : 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో వారసత్వ రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకం అన్నారు. దేశాన్ని అవినీతి, వారసత్వం అనే రెండు సమస్యలు చెదపురుగులా పట్టిపీడిస్తున్నాయన్నారు. ప్రజలంతా ఏకమై ఆ రెండింటిని తరిమేద్దామంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వారసత్వ రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయన్నారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారని రాజకీయప్రత్యర్థులు అంటున్నారు. అయితే ఇక్కడ వారంతా మరో ప్రశ్న లేవనెత్తారు. వారసత్వరాజకీయాలు బీజేపీలో కూడా ఉన్నాయని వాటి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోదీ వారసత్వ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముందునుంచీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతున్న బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు నిర్మాత బండ్ల గణేష్. ఓ మీడియా ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ వారసత్వరాజకీయాలు బీజేపీలో కూడా ఉన్నాయన్నారు.
జై షా ఏమైనా ధోనినా?
"అసలు భారతదేశంలో వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తోంది బీజేపీ. 30 శాతం బీజేపీ వాళ్లు వారసత్వ రాజకీయాలు నడిపిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కొడుకు రాజకీయాల్లో లేరా? రాజ్ నాథ్ సింగ్ కుటుంబం రాజకీయాల్లో లేరా? కేంద్రం హోంమంత్రి అమిత్ షా కొడుకు జై షా ఆయనేమైనా సచిన్ టెండుల్కర్ నా , సౌరవ్ గంగూలీనా, కపిల్ దేవ్ నా, రవిశాస్త్రినా , ధోనినా మరి ఎవరు? ఆయనను బీసీసీఐ సెక్రటరీ చేశారు. సుష్మాస్వరాజ్ భర్త గవర్నర్ గా చేశారు. వాళ్లవి వారసత్వ రాజకీయాలు కాదా? అటు అంబానీ ఫ్యామిలీ, ఇటు అదానీ ఫ్యామిలీ మధ్యలో ప్రధాని ఫ్యామిలీ. దేశం మొత్తం గుజరాత్. నేను అనవసరంగా షాద్ నగర్ లో పుట్టాను. గాంధీనగర్ లో పుట్టి ఉంటే బండ్లానీ అయ్యే వాడినేమో." - బండ్ల గణేష్
బీజేపీ వాళ్లవి వారసత్వ రాజకీయాలు కాదా?
"ఇవాళ భారతదేశంలో గుజరాతీలు లబ్దిపొందినంత ఎవరైనా లబ్దిపొందుతున్నారా? ముఖ్యమైన పదవుల్లో వాళ్లు తప్ప ఇంకెవ్వరైనా ఉన్నారా? బాధతో మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడినందుకు ఈడీతో నాపై దాడులు చేయిస్తారేమో? నేను రెడీ. నా దగ్గరేముంది కోడిగుడ్డు తప్ప. నేను డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నాను. రాజకీయ వారసత్వం బీజేపీలో లేదా? రాజ్ నాథ్ సింగ్ కుటుంబం, సుష్మాస్వరాజ్ కుటుంబం, అమిత్ షా కుటుంబం, జ్యోతిరాదిత్య సింధియా కుటుంబం. వాళ్లవి వారసత్వ రాజకీయాలు కాదా వాళ్లవేమో పరివార్ అంటారా? మీకో న్యాయం మాకో న్యాయమా? హిందుత్వం ఎవరి సొత్తు కాదు." - బండ్ల గణేష్
బండి సంజయ్ కు కౌంటర్
ప్రజాసంగ్రామ యాత్రలో సీఎం కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను ఖాసీం చంద్రశేఖర్ రిజ్వీగా పేరు మార్చి విమర్శించారు. దీనిని బండ్లగణేష్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక ముస్లిం పేరుతో హిందూ మతాన్ని అవమానించారని బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ బీజేపీ మత హింసను రెచ్చగొడుతోందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ మతం విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. కేసీఆర్‌లోని దైవభక్తి, హిందుత్వవాదంతో పోలిస్తే దేశంలో ఏ బీజేపీ నాయకుడు సరిపోరని బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ వేల కోట్లు వెచ్చించి యాదాద్రి ఆలయాన్ని నిర్మించారన్నారు.
Also Read : Janasena On Gudivada Amarnath : మంత్రి గుడివాడ అమర్నాథ్ బాలనటుడు, పవన్ ను విమర్శించడమే డ్యూటీ - కిరణ్ రాయల్