బెల్జియంలో అత్యంత ఆశ్చర్యకర ఘటన జరిగింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే కారు అంగుళం కూడా అదుపు తప్పకుండా దానికదే ముందుకు సాగింది. సుమారు 25 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీస్‌ అధికారులు కలిసి ఆ వాహనాన్ని వెంబడించి ఆపారు. డ్రైవర్ అప్పటికీ అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజల రోజువారీ జీవితాన్ని అత్యంత సురక్షితంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ పుణ్యమా అని ఎంతో మంది ప్రాణాలు రక్షించబడుతున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారిని సైతం టెక్నాలజీ గండం నుంచి గట్టెక్కిస్తుంది. ఇందుకు బెల్జియంలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. ఓ కారును నడుపుకుంటూ వెళ్తున్న వ్యక్తి సడెన్ గా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కానీ, కారు అలాగే ప్రయాణించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 25 కిలో మీటర్లు వెళ్లింది. అయినా ఎలాంటి ప్రమాదం జరగలేదు. దానికి కారణం కారులోని టెక్నాలజీ మూలంగానే తను ప్రాణాలతో బయట పడగలిగాడు.


కారును వెంబడించి ఆపిన ఎమర్జెన్సీ అధికారులు


ఈనెల 14న బెల్జియంలోని లెవెన్ వైపు వెళ్లే రహదారి మీద వాహనాలు వెళ్తున్నాయి. సుమారు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓ రెనాల్ట్ క్లియో కారు సైతం రోడ్డు మీద వెళ్తుంది. ఆ కారును చూసి తోటి వాహనదారులు షాక్ అయ్యారు. డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉన్నా.. కారు ముందుకు వెళ్లడాన్ని గమనించి వెంటనే  ఎమర్జెన్సీ సర్వీస్‌లతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల్లో స్పాట్ కు చేరుకున్న పోలీసులు డ్రైవర్ అపస్మాకర స్థితిలో ఉన్న విషయాన్ని గమనించారు.  కారును ఆపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.  హాలెన్ సమీపంలోకి వెళ్లగానే దాన్ని నిలిపివేశారు.


అపస్మారక స్థితిలో 25 కిలో మీటర్ల ప్రయాణం


కారు డోర్ తీసి చూడగానే 41 ఏళ్ల వయసున్న డ్రైవర్ జెంక్ ఎలాంటి చలనం లేకుండా సీట్లో పడి ఉన్నాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ తనకు ఆల్కహాల్, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఏం తేలిందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. కానీ.. జెంక్ తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత కనీసం 25 కిలో మీటర్ల వరకు అపస్మాకర స్థితిలోనే ముందుకు సాగినట్లు గుర్తించారు.


ప్రాణాలను కాపాడిన టెక్నాలజీ


కారులో ఉన్న టెక్నాలజీ కారణంగానే జెంక్ ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు.  డ్రైవర్ స్పృహ తప్పిన తర్వాత కారులోని లేన్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ సమర్థవంతంగా పని చేసినట్లు తెలిపారు. లేన్ అసిస్ట్ కారు దారి మళ్లిన ప్రతిసారీ లేన్ మధ్యలోకి తిరిగి వచ్చేలా చేసినట్లు గుర్తించారు. మరోవైపు క్రూయిజ్ కంట్రోల్.. కారు వేగాన్ని స్థిరంగా ఉంచినట్లు చెప్పారు. మొత్తంగా ఈ ఘటనలో జెంక్ సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. టెక్నాలజీ డ్రైవర్ తో పాటు ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.


Also read: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి


Also read: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే