Telangana High Court: తెలంగాణ హైకోర్టులో దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి భారీ ఊరట లభించింది. భూములకు సంబంధించి రామానాయుడు కుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించి కోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఆ భూములు రామానాయుడు కుటుంబానికే చెందినవిగా తేల్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.నందలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 


రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 1996లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొన్ని భూములను కొనుగోలు చేసింది. ఆ భూములతోపాటు ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పి.గోవిందరెడ్డి తదితరులకు చెందిన 26.16 ఎకరాల భూమి కూడా ఉంది. వాటికి సంబంధించిన హక్కుల వివాదం నడుస్తోంది. ఆ వ్యవహారంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాలు చేస్తూ ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేసింది.


వీటిపై సుదీర్ఘ వాదనలను విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఆ భూములు రామానాయుడు కుటుంబానికి చెందినవేనని హై కోర్టు తేల్చింది. 


‘‘రామానాయుడు సహా తదితరులు రికార్డును తారుమారు చేశారని, మోసపూరిత పత్రాలు సృష్టించారని ప్రభుత్వం ఎక్కడా ఆరోపణలు చేయలేదు. దీనికి సంబంధించి రికార్డుల్లో కూడా ఎలాంటి ఆరోపణలు లేవు. 1961లో అసైన్‌మెంట్‌ తప్పని చెబుతున్నారు.. 1963లో మాజీ సైనికులకు భూమి కేటాయింపు జీవో వచ్చినపుడు, గతంలో చేసిన అసైన్‌మెంట్‌ రద్దుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూమిని కేటాయించిన 5 దశాబ్దాల తరువాత, అనుబంధ సేత్వార్‌ జారీ చేసిన 15 ఏళ్ల తరువాత చర్యలు ప్రారంభించడం సరికాదు. అనుబంధ సేత్వార్‌ను రద్దు చేయడం చెల్లదు. ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించలేదు’’ అంటూ ప్రభుత్వ అప్పీళ్లను ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.


Also Read: KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా


సిటీ సివిల్ కోర్టులో మరో కేసు
మరోవైపు, సిటీ సివిల్ కేసులో మరో కేసు పెండింగ్ లో ఉంది. నిర్మాత సురేష్ బాబు తనకు అమ్మిన భూమిని తన కుమారుడు రానా పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో బాధితుడు గతంలోనే పిటిషన్ వేశాడు. కొద్ది రోజుల క్రితం బాధితుడు మీడియాతో మాట్లాడుతూ తనకు మోసం జరిగిందని  ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రానాకు రీజిస్ట్రేషన్ చేశారని బాధితుడు ఆరోపించారు.


Also Read: Munugode News: మూడు పార్టీల వ్యూహంలో మునుగోడు, ఒకరికి మించి మరొకరి వ్యూహాలు - రంగంలోకి అమిత్ షా