కరీంనగర్ జిల్లా ధర్మపురి శాసనసభ ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంత్రి ఈశ్వర్ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. ఈశ్వర్ తరఫు న్యాయ వాదుల వాదనతో ఏకీభవించని ధర్మాసనం పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేశారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నుండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో దిగారు. నువ్వానేనా అన్నట్టుగా జరిగిన ఆ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించినట్లు ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు ప్రకటించారు. అయితే, సరిగ్గా లెక్కించకుండా గెలిచినట్లు ప్రకటించారని కాంగ్రెస్ నేతలు అప్పట్లో హడావుడి చేశారు. రెండో స్థానంలో నిలిచిన లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిపై న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని అప్పట్లోనే ప్రకటించారు.
సీనియర్ నేతగా పేరు ఉన్న కొప్పుల ఈశ్వర్ ఓటమి భయంతోనే గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగడంతో అనేక ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో పోటీ పడ్డారని, అయినప్పటికీ చివరి నిమిషంలో ఓడిపోతారని భయంతో అధికారుల అండ చూసుకుని తప్పుడు మార్గంలో గెలిచారని ఆరోపించారు. ఇంత చేసినప్పటికీ కేవలం 441 ఓట్ల మెజారిటీ మాత్రమే లభించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీవీ ప్యాట్ల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించక ముందే అధికారులు కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది.
హైకోర్టులోనూ చుక్కెదురు
దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 28వ తారీఖున ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సదరు పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ మంత్రి ఈశ్వర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
అయితే వారి వాదనతో విభేదించిన న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా అందుకు అనుమతి ఇస్తూనే పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో ధర్మపురి ఎన్నికలకు సంబంధించి 2018 లో మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది.
ఇప్పటికే చిక్కుల్లో వేములవాడ ఎమ్మెల్యే
ఇప్పటికే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ధర్మపురి ఎన్నికకు సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా అనూహ్య తీర్పు వచ్చినట్లయితే కొప్పుల ఈశ్వర్ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉండేది. వచ్చే ఎన్నికల వరకూ కీలకమైన ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి వ్యూహాలు రచిస్తున్న ఈ సందర్భంలో కొప్పుల ఈశ్వర్ కి తీర్పు వ్యతిరేకంగా వస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే! అని చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కూడా మంచి పట్టున్న లీడర్ కావడంతో ఈసారైనా విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. ఒకవేళ తీర్పు తనకు అనుకూలంగా వస్తే రెండో స్థానంలో నిలిచిన తనకి ఇప్పటికే సమయం మించిపోవడంతో ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనే అంశంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.