Cotton Farmers: మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. గత 45 రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నల్లరేగడి నేలల్లో వేసిన పత్తి చేనులన్నీ ఎర్రబారిపోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా రైతులను కష్టాల కడలిలోకి నెడుతున్నాయి. ఇప్పటికే పచ్చ దోమ, తెల్ల దోమ, బొంత లాంటి రోగాలు వస్తూ మొక్కలు చనిపోతుండగా... ఈ వానలు మొత్తం పంటను నాశనం చేస్తున్నాయి. రాబోయే కాలంలో పత్తి పంట వేసి అప్పుల పాలవడం కంటే ప్రత్యామ్నాయ పంటలు వేయడం మంచిదని ఆలోచిస్తున్నారు. 


57 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా..


కనీసం ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే అందులో సగం కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని పత్తి రైతులు వివరిస్తున్నారు. ఈసారి అధిక వర్షాలతో పత్తి రైతులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టాలే ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం జిల్లాలో 57 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వారికి తగ్గట్టుగా దాదాపుగా 50 వేల ఎకరాలు ఈసారి నాటారు. మంచి ధర పలుకుతుండడంతో చాలా మంది రైతులు రెగ్యులర్ గా వేసే పంటలను మార్చి పత్తి వైపే మొగ్గు చూపారు.


అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి..


జూలై నుండి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో నల్లరేగడి నేలలు జాలువారి పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణంగా జూలై మాసంలో 265.9 మిల్లీ మీటర్ల వర్షం కురవాలి. కానీ 705.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడం రైతుల పాలిట శాపంగా మారింది. ఇక ఆగస్టు 16వ తేదీ వరకు పది రోజుల పాటు వర్షాలు పత్తి పంటలో నష్టం వాటిల్లే అవకాశాలు పెరిగాయి. మొత్తం నలభై ఏడు రోజుల్లో దాదాపు 35 రోజుల పాటు వరుసగా వర్షాలు కురవడంతో పత్తి చేను ఎదుగుదల లేక ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రకరకాల రోగాలతో పాటు పొలాలన్నీ పాడవుతుందటంతో.. చాలా మంది కలుపు మొక్కలు కూడా తీయలేకపోతున్నారు. ఇక ఎకరాకు 200 ఎమ్ఎల్ మోనోక్రోటోఫాస్ పిచికారి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


పంటమార్పిడి చేయాలంటేనే వణుకుతున్నారు..


దీంతో కనీసం ఒక ఎకరాకు 1500 రూపాయలు ఖర్చు కేవలం క్రిమిసంహారక మందులు రైతులు పెట్టాల్సి వస్తోంది. దాదాపుగా 45 వేల ఎకరాల్లో సుమారు 5 వేల ఎకరాలలో వేసిన పత్తిని తీసేసి మరో పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రతిసారి వేల రూపాయలు ఖర్చుపెట్టిన కూడా పత్తి దిగుబడి లేక వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి సంవత్సరం వస్తున్న మాదిరిగా తనకు ధర గిట్టుబాటు అవుతుందని ఆశించిన రైతన్నకు ఈసారి అకాల వర్షాలు తీవ్ర మనోవేదన మిగిల్చాయి. దీంతో మరోసారి పంట మార్పిడి ప్రయోగం చేయాలంటే భయపడే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది.