తమిళనాడులో కొద్ది రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవానుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు జవాను మరణంపై రాజకీయ నేతలు, మంత్రుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, అమరజవాను సాయి తేజకు నివాళులు అర్పించిన తీరుపై కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమర జవాన్ సాయి తేజకు నివాళులు అర్పించడానికి ఏపీ మంత్రులు హాజరుకాకపోవడం పట్ల తాను బాధపడుతున్నానని  వి. హనుమంతరావు అన్నారు. 


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అయ్యప్ప మాలలో ఉంటే.. ఇతర మంత్రులు వెళ్లవచ్చు కదా అని ప్రశ్నించారు. అసలు ఏపీ సీఎం జగన్ ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ వీహెచ్ నిలదీశారు. సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో పీవీ సింధు, సానియా మీర్జాకు కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఈ అమర జవాన్ కుటుంబానికి ఇవ్వరా అని ప్రశ్నించారు. అసలు సాయి తేజ సాటి తెలుగు వాడని కూడా కేసీఆర్ గౌరవించరా అని వీహెచ్ నిలదీశారు. 


రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తూ చనిపోయిన 700 మంది రైతులకు కేసీఆర్ పరిహారం ఇస్తానన్నారని.. ఇలాంటి దేశ భక్తులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంటికి వస్తే కౌగలించుకునే కేసీఆర్.. సైనికుడి విషయంలో అనుసరించే విధానం ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. సాయి తేజ కుటుంబం నుంచి దేశం కోసం ఇద్దరు కొడుకులను పంపించారని గుర్తు చేశారు. మరి ఇలాంటి విషయంలో జవాన్లను ప్రభుత్వం గౌరవిస్తేనే దేశ యువతకు మంచి సందేశం అందుతుందని తెలిపారు. కాబట్టి, మనం, మన ప్రభుత్వాలు అమర సైనికులను గౌరవించుకోవాలని వి. హనుమంతరావు పిలుపు ఇచ్చారు. 


తమిళనాడులో నీలగిరి పర్వతాల్లో డిసెంబరు 8న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో లాన్స్ నాయక్ గ్రేడ్‌కు చెందిన, చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను కూడా ఉన్నారు. సాయి తేజ అంత్యక్రియలు ఆదివారం (డిసెంబరు 12) జరిగిన సంగతి తెలిసిందే.


Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన


Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..


Also Read: Dharmapuri Arvind: బీజేపీ అధిష్ఠానం దృష్టి పడింది.. కొద్ది రోజుల్లో TSలో మరిన్ని సంచలనాలు: ధర్మపురి అర్వింద్


Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి