Telangana CM KCR Meets NCP Leader Sharad Pawar: నేడు ముంబైలో పర్యటిస్తున్నతెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. సాయంత్రం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసంలో పవార్‌తో పాటు ఆయన కుమార్తె సుప్రియా సూలే, నటుడు ప్రకాష్ రాజ్, తెలంగాణ నుంచి వెళ్లిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని, దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.


సరికొత్త అజెండా, విజన్ కావాలి..
దేశాన్ని సరైన దిశగా నడిపించాలంటే సరికొత్త అజెండా కావాలని, కొత్త విజన్ అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని శరద్ పవార్‌తో చర్చించినట్లు తెలిపారు. అనుభవం ఉన్న నేత కనుక శరద్ పవార్ ఆశీర్వాదం తీసుకున్నాను, ఆయనతో కలిసి పనిచేస్తారు. ఇలాంటి ఆలోచన కలిగిన నేతలతో త్వరలోనే పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.


గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనే వాదన తెరపైకి తెచ్చారు. అప్పట్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేద్దామని భావించారు. ఎన్నికల ఫలితాల తరువాత దాదాపు రెండేళ్లు ఈ విషయంపై మాట ఎత్తని కేసీఆర్ గత కొంతకాలం నుంచి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా పావులు కదుపుతున్న కేసీఆర్ నేడు ముంబైకి వెళ్లారు. మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన గులాబీ బాస్, సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.











మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackery)తో భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రాంతీయ పార్టీలు పోరాటంలో అడుగు ముందుకేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 1000 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకున్న పెద్ద రాష్ట్రం కనుక మొదట మహారాష్ట్ర నేతలతో భేటీ అయినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. 


ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడం లాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తమకు పాజిటివ్‌గా మలుచుకునే ప్రయత్నంలో కేసీఆర్ బిజీగా ఉన్నారని ఇదివరకే అర్థమైంది. సింగరేణి, ఎల్ఐసీ లాంటి సంస్థల్ని బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తుందని పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలంటే శివసేన, ఎన్సీపీ లాంటి ప్రాంతాలతో కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.


Also Read: CM KCR: ఇది ఆరంభం మాత్రమే, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు అవసరం : సీఎం కేసీఆర్


Also Read: KCR Sharad Pawar Meeting: ముంబైలో శరద్ పవార్‌తో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ