కొన్ని సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఈ విషయంలో సినీ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో సహా.. ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి ఇండస్ట్రీ పెద్దలు స్వయంగా జగన్ ను కలిసి ఈ సమస్యకు పరిష్కారమొస్తుందని మీడియా ముందు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం నాడు నిర్మాతల మండలిలో మీటింగ్ జరగనుందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. చిరంజీవి, మోహన్ బాబు లాంటి ప్రముఖులు ఈ మీటింగ్ కి హాజరవుతారని అన్నారు. 

 

తీరా మీటింగ్ లో ఎవరూ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి మొత్తం 240 మందికి ఈ మీటింగ్ కి సంబంధించిన ఆహ్వానం వెళ్లిందట. అందులో నుంచి కనీసం వంద మంది కూడా ఈ మీటింగ్ కి రాలేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు లాంటి వాళ్లు ఎక్కడా కనిపించలేదు. దర్శకుడు రాజమౌళి మాత్రం హాజరయ్యారు. 

 

తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసన్న కుమార్, సి.కళ్యాణ్, నట్టి కుమార్ తదితరులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కరోనా తరువాత దర్శకులు, నిర్మాతలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యలను చర్చించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం కానీ టికెట్ రేట్స్, సినీ పరిశ్రమ సమస్యల గురించి కాదని క్లారిటీ ఇచ్చారు. 

 

చిరంజీవితో పాటు సినీ ప్రముఖులంతా కలిసి జగన్ ను కలవడం, తమను కావాలనే ఆ మీటింగ్ కి పిలవలేదని మంచు ఫ్యామిలీ కామెంట్స్ చేయడంతో.. ఆదివారం నాడు మీటింగ్ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీటింగ్ లు ప్రముఖులు హాజరుకాలేదు. ఏదో భారీ రేంజ్ లో మీటింగ్ జరుగుతుందనుకుంటే.. కేవలం దర్శకనిర్మాతల సమస్యల కోసమే మీటింగ్ నిర్వహించామని చెప్పి షాకిచ్చింది నిర్మాతల మండలి.