అభిమానులను ఎంగేజ్‌ చేసేందుకు ఐపీఎల్‌ జట్లు వినూత్నంగా క్యాంపెయిన్లు నిర్వహిస్తుంటాయి. జట్టుపై అభిమానం పెంచేందుకే విభిన్నంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఏకంగా మెటావెర్స్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ లోగోను ఆవిష్కరించింది. ఆ జట్టు డగౌట్‌ను క్రియేట్‌ చేసింది.


మెటావెర్స్‌లో 'ది టైటాన్స్‌ డగౌట్‌' పేరుతో వర్చువల్‌ స్పేస్‌ను సృష్టించామమని గుజరాత్‌ టైటాన్స్‌ తెలిపింది. రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్లో అభిమానులు ఈ వర్చువల్‌ స్పేస్‌ ద్వారా తమతో ఎంగేజ్‌ కావొచ్చని తెలిపింది. మొత్తంగా అంతర్జాతీయ ఆటగాళ్లు, అభిమానుల కోసం వర్చువల్‌ స్పేస్‌ను ఏర్పాటు చేసిన  భారత తొలి క్రీడా జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ రికార్డు సృష్టించింది.


గుజరాత్‌ టైటాన్స్‌ తమ జట్టు లోగోను మెటావర్స్‌లోనే ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ప్రధాన కోచ్‌ ఆశీశ్‌ నెహ్రా, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ హాజరయ్యారు. ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ లోగోను ఆవిష్కరించారు.


'క్రికెట్‌ అంటే అంతులేని అవకాశాల గని. అందుకే మేం ఈ క్రీడాస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాం. మెటావెర్స్‌లోకి గుజరాత్‌ టైటాన్స్‌ ప్రవేశించిందని చెప్పేందుకు, లోగో ఆవిష్కరించినందుకు మేమెంతో థ్రిల్‌ అవుతున్నాం. ఇది మా అభిమానులకు అద్భుతమైన అనుభవం ఇస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మా జట్టుతో వారు ఇంటరాక్ట్‌ అయ్యేందుకు ఇదో మంచి మార్గమని మేం నమ్ముతున్నాం' అని గుజరాత్‌ టైటాన్స్‌ సీవోవో కల్నల్‌ అర్విందర్‌ సింగ్‌ అన్నారు.


గుజరాత్‌ టైటాన్స్‌ మొదట హార్దిక్‌ పాండ్య, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను డ్రాఫ్ట్‌ చేసింది. ఐపీఎల్‌ మెగా వేలంలో మహ్మద్‌ షమి, జేసన్‌ రాయ్‌, లాకీ ఫెర్గూసన్‌, రాహుల్‌ తెవాతియా, విజయ్‌ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా వంటి క్రికెట్లర్లను కొనుగోలు చేసింది.