మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackery)తో సీఎం కేసీఆర్(KCR) ఇవాళ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరువులు ముఖ్యమంత్రులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... దేశ రాజకీయాలు, అభివృద్ధి గురించి ఉద్ధవ్ ఠాక్రేతో సుదీర్ఘంగా చర్చించామని, అనేక విషయాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఉద్ధవ్ ఠాక్రేను కలవడం చాలా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారని, వారిని త్వరలో కలుస్తానన్నారు. మరికొద్ది రోజుల్లో అందరి నేతలతో హైదరాబాద్(Hyderabad)లో సమావేశమవుతున్నారు. 1000 కి.మీల సరిహద్దు మహారాష్ట్ర(Maharastra), తెలంగాణ(Telangana)లదేని అనిపిస్తోంది. మహారాష్ట్ర సహకారంతో పెద్ద నీటిపారుదల ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు.
దేశంలోని రాజకీయ పరిణామాలపై చర్చించామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించామని తెలిపారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర సీఎంతో చర్చలు ఆరంభం మాత్రమే మున్ముందు పురోగతి వస్తుందన్నారు. త్వరలో అన్ని ప్రాంతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ తన వైఖరి మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. శివాజీ(Shivaji), బాల్ ఠాక్రే(Bal Thackery) వంటి యోధుల స్ఫూర్తితో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. రాబోయే రోజుల్లో శివసేనతో కలిసి పని చేస్తామన్నారు.
'దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పెనుమార్పులు అవసరం. మహారాష్ట్ర నుంచి ఏ ఫ్రంట్ వచ్చినా అది విజయమే. అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా ఉద్ధవ్ ఠాక్రేను తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానిస్తున్నాను.' అని సీఎం కేసీఆర్ అన్నారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, ప్రతీకార భావంతో చర్యలు తీసుకుంటున్న తీరును సమర్ధించడం లేదన్నారు. ఈ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త రకం సమీకరణం ప్రారంభమైందని, దీన్ని పూర్తిగా రూపొందించడానికి కచ్చితంగా సమయం పడుతుందన్నారు.