Telangana BjP:  కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అర్జంట్‌గా ఢిల్లీ రావాలని హైకమాండ్ ఆదేశించడంతో మంగళవారం నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బహిరంగసభ ఏర్పాట్లు పర్యవేక్షించాల్సి ఉన్నా వెళ్లారు.   కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీలో నెలకొన్న పరిస్థితులు,  మోదీ సభపై అమిత్ షాతో చర్చించారు. 


పాలమూరు మోదీ సభకు పలువురు సీనియర్ల డుమ్మా 


స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తే..చాలా మంది సీనియర్ నేతలు హాజరు కాలేదు. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు సభలో ఎక్కడా కనిపించలేదు. వీరంతా కొద్ది రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ను ఓడించడానికి ఏం చేయడానికైనా సిద్ధమని చెబుతున్నారు. బీఆర్ఎస్‌ను ఓడించడానికే తాము బీజేపీలో చేరామని కానీ ఇప్పుడు బీజేపీ .. బీఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తోందని వారంటున్నారు. మాజీ ఎంపీ విజయశాంతి ఇదే తరహా ప్రకటనలు సోషల్ మీడియాలో చేస్తున్నారు.  బీఆర్‌ఎస్‌ పట్ల కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్ల ‘బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటే’ అన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని అసంతృప్త నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదని అధినాయకత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది కానీ మాట మార్చిందని వారంటున్నారు.


ప్రధాని టూర్‌కి తెలంగాణ సీనియర్లు దూరం- తమ దారి తాము చూసుకుంటారా ?


పార్టీలో పరిస్థితులపై హైకమాండ్ అసంతృప్తి !                                      


బీజేపీలో ముఖ్య నేతలు  కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టచ్‌లోకి వెళ్లారని.. మరోవైపు విజయశాంతి, వివేక్‌లు కూడా సొంత గూటికి చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ.. సోయం బాపూరావు సభకు రాకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. వీటన్నింటిపై ఆరా తీసేందుకు కిషన్ రెడ్డిని అమిత్ షా ఢిల్లీ పిలిపించారని అంటున్నారు. మంగళవారం జరగనున్న నిజామాబాద్ బహిరంగసభకు అందరూ హాజరయ్యేలా చూడాలని ఆదేసించినట్లుగా తెలుస్తోంది. 


టీఎస్‌పీఎస్సీని ఎందుకు రద్దు చేయలేదు? - సీఎం కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి సూటిప్రశ్న


అభ్యర్థుల జాబితాపై కసరత్తు 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కూడా  కిషన్ రెడ్డి హైకమాండ్ తో చర్చించారు. పదో తేదీన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే అభ్యర్థుల్ని ఖరారు చేయాలనుకుంటున్నారు. అలాగే తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్ననేపథ్యంలో.. మరిన్ని మోదీ సభలు పెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, నిర్మల్‌లలో కూడా ప్రధాని మోదీ పర్యటించేలా ప్రణాళికలు  సిద్ధం చేసుకుంటున్నారని  చెబుతున్నారు. కారణం ఏదైనా బీజేపీ  గతంలోలా గట్టి పోటీ ఇస్తుందన్న భావన  కూడా లేకపోవడం బీజేపీ హైకమాండ్ ను నిరాశ పరుస్తోందని చెబుతున్నారు.