Revanth Reddy: గ్రూప్-1లో చోటుచేసుకున్న పొరపాట్లు వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ తప్పిదాల వల్లే గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం చేతకాని ప్రభుత్వం అధికారంలోకి ఉందని విమర్శలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌టీపీతో పాటు మిగతా పార్టీలన్నీ బీఆర్ఎస్ సర్కార్‌ను తప్పుబడుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు కురిపిస్తున్నారు.


ఆదివారం టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పరీక్షలు కూడా నిర్వహించడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్‌పీఎస్సీ మారిపోయిందని, రాజకీయాల్లో పదవులు ఇవ్వలేనివారికి టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. గుమస్తా స్థాయి లేనివారి ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తే తప్పులే జరుగుతాయని  విమర్శించారు. ఈ నిర్లక్ష్యానికి ముమ్మాటికీ కేసీఆర్, కేటీఆర్‌లే కారణమని అన్నారు.


టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలు, గ్రూప్-1 పరీక్షపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ఆరోపించారు.  తక్షణమే టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ అసలు పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే అన్ని సమస్యలు తీరుతాయన్నారు. నిరుద్యోగుల పోరాటానికి కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. గ్రూప్-1 మళ్లీ నిర్వహించడం వల్ల ఎన్నో ఏళ్లుగా కష్టపడి ప్రిపేర్ అయిన అభ్యర్థుల శ్రమ వృథా అయిందన్నారు. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తూ ఉంటుందని, న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని రేవంత్ తెలిపారు. పేపర్ లీకేజీలు బయటపడిన సమయంలోనే టీఎస్‌పీఎస్సీని రద్దు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రభుత్వ ఆలసత్వం వల్లనే అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని, దీని వల్ల ప్రభుత్వంపై నిరుద్యోగులకు నమ్మకం పోయిందన్నారు.


ఈ సమావేశంలో తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని, ఇలాంటి పరిస్తితి రావడం దురదృష్టకరమన్నారు. తక్షణమే టీఎస్‌పీఎస్సీని రద్దు చేసిన కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని, వారి కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఇద్దరూ కలిసి వేల కోట్లకు పేపర్లను అమ్ముకుని 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారన్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో 258 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.