తెలంగాణ బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. ఒకైపు కాంగ్రెస్ పుంజుకుంటుంటే...మరోవైపు కమలం పార్టీలోని సీనియర్లు కొంతకాలంగా మౌనమునులుగా మారిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాక్టివ్ గా ఉండాల్సిన సీనియర్లు, పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు.  ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు సభకు బీజేపీ ముఖ్యనేతలు, సీనియర్లంతా డుమ్మా కొట్టారు. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహనరావు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు శంకుస్థాపనలు, బహిరంగసభలో ఎక్కడా కనిపించలేదు. ఈ నేతల గైర్హాజరు గురించే తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 


పార్టీ మార్పు గ్యారెంటీనా ?


9 మంది మాజీ ఎంపీలతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానంపై కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. పార్టీలో కొత్తగా చేరిన కీలక పదవులు ఇవ్వడం సీనియర్లకు ఆగ్రహం తెప్పించింది. కొద్ది రోజుల క్రితం అసంతృప్త నేతలంతా అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి నివాసంలో రహస్యంగా భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 9 మంది మాజీ ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేసి, కాంగ్రెస్ చేరాలని భావించారు. కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లి, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఏమైందో ఏమో పార్టీ మార్పుపై సైలెంట్ అయిపోయారు. పార్టీలో ఏ స్థాయి వ్యక్తి వచ్చినా, ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ప్రధాని మోడీ మహబూబ్ నగర్ కు దూరంగా ఉన్నారు.  


మారుతున్న సమీకరణాలు


రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్ఠానం వైఖరిపై సీనియర్లు చర్చించుకున్నారు. బండి సంజయ్ హయాంలో గులాబీ పార్టీపై అగ్రెసివ్ గా వ్యవహరించారు. తెలంగాణలో కమలం పార్టీకి కొత్త జోస్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు కనిపించడం లేదన్నది సీనియర్ల వాదన. కిషన్ రెడ్డి అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికార పార్టీపై దూకుడుగా వ్యవహరించడం లేదు. బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటే న్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని అంటున్నారు. సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్యమకారులంతా బీజేపీ వైపు మొగ్గుచూపారు. వారికి సరైన గుర్తింపు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారం సీనియర్లకు ఆగ్రమం తెప్పించింది. అధినాయకత్వం వైఖరి స్పష్టం కాకపోవడంతో అసంతృప్త సీనియర్లు వరుస భేటీలు నిర్వహించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి


ప్రధాని మోడీ మహబూబ్ నగర్ పర్యటనతో పార్టీలో తమ పాత్రపై క్లారిటీ వస్తుందని సీనియర్లు భావించారు. అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి అన్నట్లు వారి గురించి ఎవరు పట్టించుకోలేదు. మన అవసరం పార్టీకి అవసరం లేనపుడు, ఇంకెందుకు ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీరంతా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టచ్‌లోకి వెళ్లారని.. మరోవైపు విజయశాంతి, వివేక్‌లు కూడా సొంత గూటికి చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.