2003 అక్టోబర్ 1న టీడీపీ అధినేత, అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు పునర్జన్మ పొందారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలోని అలిపిరి ఘాట్ రోడ్డులో బాంబు దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రజలతోపాటు వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే బతికానని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు.
క్లైమోర్ మైన్స్ తో పేల్చివేత
అక్టోబర్ 1 2003న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా, మావోయిస్టులు బాంబులు పేల్చారు. చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారును నక్సలైట్లు శక్తివంతమైన క్లైమోర్ మైన్స్ తో పేల్చివేశారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఘాట్ రోడ్డులోని అలిపిరి టోల్ గేట్ వద్ద బాంబు దాడి జరిగింది.
బాంబు పేలుడు శబ్దం 2 కిలోమీటర్లు దూరం వరకు
బాంబు పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దాడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు పేలిపోయి, ఓ రాయిని ఢీకొని పల్టీలు కొట్టింది. సంఘటనా స్థలంలో మరో రెండు బాంబులు లభించాయి. అత్యంత పకడ్బందీగా రూపొందించుకున్న పథకం మేరకే నక్సలైట్లు ఈ దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన చంద్రబాబును చికిత్స కోసం హైదరాబాదు తరలించారు. చంద్రబాబుతో పాటు అప్పటి ఐటి శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి కూడా గాయాల పాలయ్యారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఎవరెవరిపై కేసులు
ఈ కేసులో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి సహా అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జీ, పాండురంగారెడ్డి అలియాస్ సాగర్, హరగోపాల్ అలియాస్ రామకృష్ణతో పాటు 35 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసు పదకొండేళ్ల పాటు విచారణ జరిగింది. రామ్మోహన్ రెడ్డి, నరసింహా రెడ్డి, మాలచంద్రలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులకు నాలుగేళ్ల శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2011లోనే తిరుపతి సెషన్స్ కోర్టు తొలి తీర్పు వెలువరించింది. దీనిపై నిందితులు హైకోర్టుకు వెళ్లారు. ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. రెండో ఛార్జీషీటులోని ముగ్గురిని దోషులుగా కోర్టు తేల్చింది.
నక్సైలైట్లు పక్కా ప్లాన్
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉండేది. వారిని అణిచివేయటానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించారు. దీంతో ఆయన్ని చంపాడానికి ప్రణాళికలు రచించారు. అలిపిరి టోల్ గేట్ వద్ద నక్సలైట్లు ఏకంగా తొమ్మిది శక్తిమంతమైన బాంబులను అమర్చారు. చంద్రబాబును అంతమొందించేందుకు శాయశక్తులా ప్రయత్నాంచారు. బుల్లెట్ వాహనం కారణంగా ప్రాణాలతో బయటపడ్డారు. స్వామి వారే రక్షించాడని పలు మార్లు చెప్పుకున్నారు.