IndiGo Plane: ఇండిగో విమానం గాలిలో ఉన్న సమయంలో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డ చిన్నారి ప్రాణాలు కాపాడారు ఇద్దరు వైద్యులు. శనివారం రాంచీ- ఢిల్లీ ఇండిగో విమానంలో ఇద్దరు వైద్యులు 6 నెలల చిన్నారికి ప్రాణం పోశారు. పుట్టినప్పటి నుంచే గుండె జబ్బుతో బాధ పడుతున్న చిన్నారిని వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత చిన్నారి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆరు నెలల చిన్నారి పరిస్థితి చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో తెలియక.. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఆ చిన్నారిని చూసి ఆ తల్లి ఏడవడం మొదలుపెట్టింది. దీంతో విమాన సిబ్బంది చిన్నారికి సహాయం కోసం ప్రయాణికులను అభ్యర్థించారు.


అదే విమానంలో ఐఏఎస్ ఆఫీసర్ గా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన డాక్టర్ కులకర్ణి, రాంచీలోని సదర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ మొజిమిల్ ఫెరోజ్ ఉన్నారు. విమాన సిబ్బంది సాయం కోసం అడగ్గానే వీరు స్పందించారు. చిన్నారికి ఫ్లైట్ లోని ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించారు. విమానంలో ఉండే ఎమర్జెన్సీ కిట్ లోని అత్యవసర మందులు వాడి పసికందు పరిస్థితిని చక్కదిద్దారు. చిన్నారి పరిస్థితి మెరుగపడింది. శ్వాస తీసుకోవడం మొదలు పెట్టడంతో చిన్నారి తల్లిదండ్రులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆ చిన్నారిని రాంచీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్న ఆ తల్లిదండ్రులు.. తమ వెంట ఓ డ్రగ్ కిట్ కూడా తీసుకెళ్తున్నారు. అందులోనని థియోఫిలిన్ ఇంజెక్షన్ నే వైద్యులు అత్యవసర పరిస్థితిలో ఆ చిన్నారికి అందించారు. ఈ డెక్సోనా ఇంజెక్షన్ చాలా సహాయకారిగా పని చేసిందని డాక్టర్లు తెలిపారు.


ఇలాంటి సందర్భాల్లో మొదటి 15-20 నిమిషాలు చాలా కీలకమని డాక్టర్ కులకర్ణి తెలిపారు. ఒత్తిడితో కూడుకున్న ఈ సమయంలో సమయస్ఫూర్తితో వేగంగా స్పందించాలన్నారు. పసికందు సాధారణ స్థితికి రావడానికి క్యాబిన్ సిబ్బంది కూడా చాలా సాయం చేశారని అన్నారు. విమానం ఢిల్లీలో ఉదయం 9.25 గంటలకు విమానం ల్యాండ్ అయింది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారికి వైద్య సాయం అందించారు. 






ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేయగానే... నెటిజన్లు ఆ వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇద్దరు వైద్యులు ఎంతో సమయస్ఫూర్తితో ఆ పసికందు ప్రాణాలు కాపాడారని, అలాంటి వైద్యుల అవసరం సమాజానికి ఎంతో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఏ ఎస్ డియోల్ (బట్టర్ సింగ్) అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేయగానే వైరల్ గా మారింది.