Breaking News Live: 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 10 Apr 2022 02:42 PM
AP New Ministers: 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు కోసం రాజీనామాలు సమర్పించిన  24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. మరోవైపు, కొత్తగా మంత్రి పదవికి ఎంపికైన వారి పేర్లను ఇప్పటికే ఖరారు చేశారు. సీల్డ్ కవర్లో నూతన మంత్రి వర్గ తుది జాబితాతో GAD అధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. రాత్రి 7 గంటల్లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

S Kota Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటారు సైకిల్‌ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్ధితి విషమంగా ఉండటంతో శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు విశాఖలోని శివలింగపురానికి  చెందిన మృతులు.. శ్రావణ్(7) సుహాస్ (8) గా గుర్తించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు ఇద్దరు మృతి చెందిన ఘటనను చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

Bettings Over AP New Cabinet: కొడాలి నాని మంత్రి పదవి పై భారీగా బెట్టింగ్స్

Bettings Over AP New Cabinet: తాజా మాజీ మంత్రి కొడాలి నానికి కొత్త కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి వరిస్తుందని జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. అధికారక ప్రకటన వచ్చేవరకు బెట్టింగ్ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. తాజా మంత్రివర్గ ఎంపికపై కొడాలి నాని పై ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న లిస్టు అన్ని ఊహాగానాలు కావటంతో కృష్ణాజిల్లాలో కొడాలి నాని అభిమానులు ఐపీఎల్ తరహాలో పందాలు నిర్వహిస్తున్నారు. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ విషయంలోనూ కూడా బెట్టింగ్ లు జరుగుతున్నాయని.. పోలీసులు సైతం వీటిపై ఫోకస్ చేస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్స్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

AP New Cabinet: కేబినెట్‌లో చోటు దక్కిందంటూ ధర్మాన ప్రసాద్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలతో హంగామా

AP New Cabinet: శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ కు మంత్రివర్గంలో చోటుదక్కింది అంటూ అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వీట్స్ కూడా పంపిణీ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే ధర్మాన ప్రసాద్ అయితే మాత్రం ఎటువంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్న నేను ఒకటే.. ఏదైనా పర్వాలేదు అంటూ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దు అని చెబుతున్నారు.

Vontimitta Sri Ramanavami: ప్రారంభమైన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శ్రీ రామనవమి సంధర్భంగా అంగరంగవైభవంగా ఓంటిమిట్ట కోదండరాముడి ద్వజారోహణ కార్యక్రమం వేద పండితులు నిర్వహించారు. వేద పండితుల మత్రోచ్చారణల నడుమ వైభవోపేతంగా వేడుక సాగింది. కేరళ వాయిద్యాలతో  ఆలయ ప్రాంగణం మార్మోగింది. టీటీడీ వాయిద్యాలతో సాగిన ద్వజారోహణ కార్యక్రమం,  వైభవోపేతంగా సాగిన వేడుకను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. రామ నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. స్వామి వారికి ప్రభుత్వం తరపున రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Avula Venkateshwarlu Is No More: ఏపీ హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతి

AP High Court Lawyer Avula Venkateshwarlu Is No More: ఏపీ హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతి


ఏపీ హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మూడు రోజుల కిందట సోదరుడ్ని కలిసేందుకు వెళ్లిన న్యాయవాది వెంకటేశ్వర్లును ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమని జేసీ బ్రదర్స్‌కు ఎమ్మెల్యే పెద్దా రెడ్డి సవాల్

మీసాలు రొయ్యలు, బొద్దింకలకు కూడా ఉంటాయని, మీకు దమ్ము, ధైర్యం ఉంటే రా ఫేస్ టూ ఫేస్ పబ్లిక్ లో ఎవరు ఏం చేశారో తేల్చుకుందాం అంటూ జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కడైనా, ఎప్పుడైనా జేసీ వ్యాఖ్యలపై చర్చలకు సిద్ధమన్నారు. జేసీ బ్రదర్స్ హయాంలో తాడిపత్రిలో ఎన్ని అరాచకాలు జరిగాయో అందరికీ తెలుసునన్నారు. ఇంట్లో కూర్చుని మీడియా ముందు మీసాలు తిప్పడం కాదని, రొయ్యలు, బొద్దింకలకు కూడా మీసాలుంటాయన్నారు. తాడిపత్రిలో మూడేళ్లలో ఎక్కడైనా ఒక్కచోట దౌర్జన్యం జరిగిందా చెప్పాలని ప్రశ్నించారు. మొన్నటి వరకు తాడిపత్రి ఒకరి గుత్తాధిపత్యంలోనే ఉండేదని, ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందన్నారు.

Jeevitha Rajashekhar: తిరుమల శ్రీవారి సేవలో జీవిత రాజశేఖర్

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సతీమణి జీవిత రాజశేఖర్, కుమార్తెలు శివాని, శివాత్నికలతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేసారు.. ఆలయం వెలుపల జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనాతో రాజశేఖర్ ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.. ఆయన ఆరోగ్యం కుదుటపడితే మెట్ల మార్గం గుండా నడిచి శ్రీవారిని దర్శించుకుంటాం అని మొక్కుకున్నట్లు చెప్పారు. స్వామి వారి దయతో ఆరోగ్యం కుదుటపడి కోరిక నెరవేరడంతో మొక్కులు చెల్లించుకున్నామని పేర్కొన్నారు.

Telangana Governor: నేడు భద్రాచలానికి గవర్నర్ తమిళిసై

నేడు శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై భద్రాచలం సందర్శించనున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాద్రికి గవర్నర్, వీఐపీలు వస్తుడండంతో ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రేపు రామప్ప ఆలయాన్ని కూడా గవర్నర్ సందర్శిస్తారు. రెండ్రోజుల పాటు భద్రాచలంలోని మారుమూల మూడు గ్రామాలను గవర్నర్ తమిళిసై సందర్శించనున్నారు.

Srirama Navami 2022: వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరిపారు. అనంతరం మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి.. మిథిలా స్టేడియంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన గావిస్తున్నారు. యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు జరుపుతారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 1,400 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Background

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీచడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలలో ఉష్ణోగ్రతలు దిగొస్తున్నాయి. నేటి నుంచి మరో రోజులపాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవికాలంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, దాని ప్రభావంతో రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. తెలంగాణలో చల్లని గాలులు వీచడంతో ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణంలో స్వల్ప మార్పులు జరిగాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం గాలుల ప్రభావంతో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని తెలిపారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో పెరిగిన ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నిన్నటి నుంచి దిగొచ్చాయి. అకాల వర్షాల ప్రభావంతో రాయలసీమ కాస్త చల్లగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్రతో పోల్చితే ఇక్కడ కనీసం 3, 4 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఇటీవల 40 దాటిన ఉష్ణోగ్రతలు నిన్న దిగొచ్చాయి. ఏపీలో వర్షాల ప్రభావంలో రెండు మూడు రోజులపాటు తెలంగాణలో చలి గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల ప్రభావం తగ్గడంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) రెండ్రోజులుగా పోలిస్తే నేడు గ్రాముకు రూ.35 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర మాత్రం నేడు కిలోకు రూ.200 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.53,020 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,500 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,500 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.53,020గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,500 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.