Rajiv Gandhi Abhayahastam scheme to Civils Prelims Quyalified candidates in Telangana హైదరాబాద్: సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద రూ.1 లక్ష ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి చెక్కులు అందజేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన తెలంగాణ అభ్యర్థులకు రూ.1 లక్ష రూపాయల చెక్కుల్ని అందజేశారు. మొత్తం 135 మంది సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ చెక్కులు అందజేశారు. ఇందులో 113 మంది పురుష అభ్యర్థులు కాగా, 22 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. జనరల్ 21 అభ్యర్థులు, ఓబీసీలు 62 మంది, ఎస్సీలు 19, ఎస్టీలు 33 మంది అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించారు. వారికి రాజీవ్ గాంధీ అభయహస్తం పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంపీ రఘురాం రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, సింగరేణి సీఎండీ బలరాం, ఇతర అధికారులు హాజరయ్యారు.
జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు ఇవీ
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 14 మంది అభ్యర్థులకు, వరంగల్ అర్బన్ నుంచి 12 మందికి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి 11 మంది, నల్గొండ నుంచి 10 మంది, ఖమ్మంలో 9, కరీంనగర్ నుంచి 8 మంది సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాళపల్లి, జోగులాంబ గద్వాల, మెదక్, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల నుంచి ఒక్కొక్కరు సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. చాలా జిల్లాల్లో జనరల్ అభ్యర్థులు ఒక్కరు కూడా మెయిన్స్ కు క్వాలిఫై కాలేదు. సగం జిల్లాల్లో జనరల్ అభ్యర్థులు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అర్హత సాధించలేకపోయారు.