Delhi  News:  లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్ పై  సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. కచ్చితంగా బెయిల్ వస్తుందన్న నమ్మకంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ , హరీష్ రావుతోపాటు 20మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. . జైలు నుంచి వచ్చే కవితకు స్వాగం చెప్పేందుకు అందరితో కలిసి వెళ్తున్నట్లుగా బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కవిత మార్చి  పదిహేనో తేదీ నుంచి జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్రమంగా దిగజారుతోంది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు వరుసగా బెయిళ్లు వస్తున్నాయి.  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ కూడా ఇచ్చింది.  క‌విత త‌ర‌ఫున  ప్రమఖ లాయర్  ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపిస్తున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. 


కవితకు బెయిల్ వస్తుందని గట్టి నమ్మకంలో బీఆర్ఎస్               


కవితకు  వచ్చే  వారంలో బెయిల్ వస్తుందని  గత నెలాఖరులో కేటీఆర్ భావం వ్యక్తం చేశారు. అయితే బెయిల్ రాలేదు. వాయిదా పడింది. ఇప్పుడు విచారణ జరుగుతూండటం.. సీబీఐ, ఈడీ కూడా.. బెయిల్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇప్పటికే సుదీర్ఘ కాలంగా కవిత జైల్లో ఉన్నారు. సీబీఐ చార్జిషీట్లు కూడా నమోదు చేసింది. దర్యాప్తుకూడా పూర్తయిందని తెలిపింది. ఈ క్రమంలో బెయిల్ అవకాశాలు మెరుగుపడినట్లుగా బీఆర్ఎస్ న్యాయవిభాగం నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వైపు రాజకీయ పరమైన కారణాలు కూడా కవితకు బెయిల్ దక్కడానికి కారణం కాబోతున్నాయని కొంత కాలంగా ప్రచారం గుప్పుమంటోంది. కానీ అలాంటి ప్రచారం కోర్టుల్ని అవమానించడమేనని జేపీ నేత బండి సంజయ్ ఘాటు గా తిప్పికొడుతున్నారు. 


కవితకు బెయిల్ వస్తే మారిపోనున్న రాజకీయాలు                 


కవితకు బెయిల్ వస్తే.. తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారే అవకాశం ఉంది. కేసీఆర్ చాలా కాలంగా బయట కనిపించడం లేదు. ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితయ్యారు. ఇటీవలి కాలంలో పార్టీ నేతల్ని కూడా కలవడం లేదు. కవిత జైల్లో మగ్గిపోతూండటం వల్లనే ఆయన మానసిక వేదనకు గురవతున్నారని.. కకవిత విడుదలైన తర్వాత కేసీఆర్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 


బెయిల్ వస్తే ఘనస్వాగతం పలకనున్న ఎమ్మెల్యేలు   


కవితకు మంగళవారం బెయిల్ లభిస్తే ... తీహార్ జైలు నుంచి ఆమెకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. తర్వాత కవిత రాజకీయ భవిష్యత్ పై ఆమె నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.