Discount on Property Tax In Telangana: పన్ను చెల్లింపుదారులకు తెలంగాణ పురపాలక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో (Greater Hyderabad Municipal Corporation) ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి పన్ను రాయితీ కల్పించింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీని కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆస్తి పన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ ఆఫర్ (Property Tax Early Bird Scheme) వర్తిస్తుందని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు.
వారికి మాత్రమే ఆఫర్ వర్తింపు
2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. తద్వారా 128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేవారికి ముందస్తు చెల్లింపు రాయితీ అవకాశం వర్తిస్తుందని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాయితీ పొందాలని సూచించారు.
జీహెచ్ఎంసీలో చెల్లింపుల జోరు...
ముందస్తు చెల్లింపు పన్ను రాయితీ ప్రకటించగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల జోరు పెరిగింది. కేవలం రెండు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో రూ.13.90 కోట్ల ఆదాయం సమకూరింది. 34,540 మంది ఆన్‌లైన్‌లో తమ ఆస్తి పన్నును చెల్లించారు. జీహెచ్ఎంసీ సైతం ఇదివరకే ఇంటి యజమానులకు సందేశాలు పంపించింది. 5 శాతం రిబేట్ కోసం వారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ ప్రాపర్టీ ట్యాక్స్ ముందే కడుతున్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ వాసులు జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీసెస్ సెంటర్స్, మీసేవా సెంటర్స్, ఏదైనా బిల్ కలెక్టర్స్ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని పురపాలక శాఖ సూచించింది.
గతేడాది సిరిసిల్ల టాప్..
గత ఆర్థిక సంవత్సరం 2021-22 లో రాష్ట్రంలో రూ.698 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైనట్లు సమాచారం. పురపాలక శాఖ తీసుకున్న నిర్ణయంతో దాదాపుగా లక్ష్యాన్ని చేరుకున్నారు. గత ఏడాది తరహాలోనే ఈ సారి ఆస్తులకు క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారంగా నోటీసులు ఇవ్వడం ద్వారా అన్‌లైన్‌లో యజమానులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే అవకాశం కలిగింది. గత ఏడాది 99 శాతం ఆస్తి పన్ను వసూలుతో సిరిసిల్ల పురపాలక సంఘం మొదటి స్థానంలో నిలిచింది. మెట్‌పల్లి, హుస్నాబాద్, అలంపూర్, కోరుట్ల 97 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నగరపాలక సంస్థల్లో కరీంనగర్ 95 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. అత్యల్పంగా అచ్చంపేట, మందమర్రి, ఎల్లారెడ్డి పురపాలికల్లో 60 శాతానికన్నా తక్కువగా ఆస్తి పన్ను చెల్లింపులు జరిగాయి.