వేసవి వచ్చిందంటే మామిడికాయలు విరివిగా మార్కెట్లో దొరుకుతాయి. ఈ కాలంలోనే ఆవకాయలు, ఊరగాయలు తయారీ జోరుగా సాగుతుంది. తెలుగిళ్లలో నిల్వ పచ్చళ్లకు చాలా విలువుంది. కూర ఉన్న లేకున్నా నిల్వ పచ్చళ్లు మాత్రంం ఉండాల్సిందే. వేడి వేడి అన్నంలో నెయ్యి,కొత్తావకాయ వేసుకుని తింటే ఆ రుచే వేరు. చాలా మంది ఆవకాయలు, ఊరగాయలు అనారోగ్యకారకాలని, బరువు పెరుగుతామని భావిస్తారు. నిజానికి ఈ నిల్వ పచ్చళ్ల వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. గతంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ వారు కూడా ఈ నిల్వ పచ్చళ్ల వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ఓ అధ్యయనంలో కనిపెట్టారు.
ఫెర్మెంటెడ్ ఫుడ్
నిల్వ పచ్చళ్లు ‘ఫెర్మెంటెడ్ ఫుడ్’ కోవలోకి వస్తాయి. అంటే ఎక్కువ రోజులు పులియబెట్టిన ఆహారం అని అర్థం. ఇలా పులియబెట్టిన ఆహారంలో మంచి బ్యాక్టిరియా ఉంటుంది. వీటినే ప్రోబయాటిక్స్ అంటారు. ఇవి పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరం. జీర్ణశయ పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి. రోగినిరోధక వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నాలుగు రకాల రోగనిరోధక కణాలు ఈ నిల్వ పచ్చళ్లలో ఉంటాయి. ఇవి తినడం వల్ల రక్తంలో వాపును కలిగించే ప్రోటీన్ల స్థాయులు కూడా తగ్గుముఖం పడతాయి. ఆ ప్రోటీన్లు రుమటాయిడ్ ఆర్ధరైటిస్, డయాబెటిస్, ఒత్తిడి వంటివాటికి కారణమయ్యేవి. కాబట్టి నిల్వ పచ్చళ్లు తినడం వల్ల ఈ ఆరోగ్యసమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రోజూ ఏదో ఒక నిల్వ పచ్చడి తినండి.
నష్టం ఇదే..
ఊరగాయల్లో అధిక మొత్తంలో ఉప్పు, కారం ఉంటాయి. కాబట్టి చాలా మితంగా తినాలి. నేరుగా కాకుండా అన్నంలో కలుపుకుని తినాలి. కాకపోతే ఊరగాయల వల్ల అవసరానికి మించి అన్నం తినే అవకాశం ఉంది. అలాగే ఆవకాయ కలుపుకుని అన్నం తిన్నాక, ఇతర కూరలు తినబుద్ధి కావు. దీనివల్ల శరీరానికి అంటే పోషకాలు తగ్గుతాయి. కాబట్టి ఇలా జరగరకుండా బ్యాలెన్స్ చేసుకుని తినాల్సిన అవసరం ఉంది. అధిక బరువు ఉన్న వారు, ఆవకాయలోని నూనెను తినకుండా, కేవలం మామిడి ముక్కలతోనే సరిపెట్టుకోవాలి. పప్పు, పెరుగన్నంతో వీటిని నంజుకుంటే మరీ మంచిది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఉప్పు అధికంగా ఉండే నిల్వపచ్చళ్ల జోలికి వెళ్లద్దు. వీలైతే ఉప్పు తక్కువగా వేసుకుని ప్రత్యేకంగా మీరు పచ్చళ్లు పెట్టుకోవడం ఉత్తమం.
Also read: రంజాన్ ఉపవాసంలో ఖర్జూరాలకు ఎందుకంత ప్రాముఖ్యత? సైన్సు ఏం చెబుతోంది?