సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకం పేదలకు అందని ద్రాక్షలా మారింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మందకోడిగా సాగుతోంది. కాంట్రాక్టర్లకు నిర్మాణం భారంగా మారింది. కాస్ట్ పెరగటంతో మధ్యలోనే వదిలేస్తున్నారు. స్టీల్, సిమెంట్, ఇసుక, మేస్త్రీ, కూలీల రేట్లు పెరగడంతో ఇళ్ల నిర్మాణ పనులు అనుకున్న మందకోడిగా సాగుతున్నాయ్. ధరలు పెరగడంతో కాంట్రాక్టర్లు సైతం వెనకడుగు వేస్తున్నారు. టెండర్లు పొందినా.. నిర్మాణానికి ముందుకు రావడంలేదు. ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌కాస్ట్‌లో నిర్మాణమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లు నిర్మాణం ముందుకు సాగడం లేదు. యూనిట్‌కాస్ట్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో 14,786 ఇళ్ల మంజూరు
జిల్లాకు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్ రూం పథకం కింద నియోజకవర్గాల వారీగా మొత్తం 14,786 ఇళ్లను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతంలోని ఇళ్ల నిర్మాణానికి యూనిట్‌కాస్ట్ 5లక్షల 4 వేలు, పట్టణ ప్రాంతం లోని ఇళ్లకు 5లక్షల 30వేలుగా నిర్ణయించి టెండర్లను పిలిచింది. అయితే యూనిట్‌కాస్ట్ తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది టెండర్‌లను వేయలేదు. దీంతో పలు దఫాలుగా అధికారులు టెండర్‌లను పిలవగా ఇప్పటి వరకు 9 వేల 686 ఇళ్లకు ముందుకు వచ్చారు. వీటిలో వెయ్యి 534 ఇళ్లు గడిచిన ఐదేళ్లలో పూర్తయ్యాయి. జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో 5వేల 683 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని బేస్‌మెంట్ లెవల్‌లో ఉండగా మరికొన్ని గోడలు పూర్తికాగా కొన్ని స్లాబ్‌లు పూర్తయ్యాయి. టెండర్ అయిన వాటిలో 4వేల 300 ఇళ్లు ఇప్పటి పనులు మొదలు కాలేదు. అధికారులు ఒత్తిడిచేసినా టెండర్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు పనులను చేయడంలేదు. యూనిట్‌కాస్ట్ తక్కువగా ఉండడం, పెరిగిన ధరలతో వెనకడుగు వేస్తున్నారు.
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరైన సమయంలో సిమెంట్ బస్తా ధర 230 రూపాయలు నుంచి 250 వరకు ఉండేది. ప్రస్తుతం సిమెంట్ బస్తా ధర 370 రూపాయల నుంచి 380 మధ్య అమ్మకాలు చేస్తున్నారు. బస్తాకు సుమారు 150 నుంచి 170 రూపాయల వరకు ధరలు పెరిగాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఐదేళ్ల క్రితం సబ్సిడీలో ఒకే ధరకు సిమెంట్ సరఫరా చేస్తామన్న కంపెనీలు ఆ తర్వాత చేతులెత్తేసాయి. అన్ని ఇళ్లకు 250 రూపాయలకు బస్తా సరఫరా చేస్తామని వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నా... బహిరంగ మార్కెట్‌లో భారీగా ధరలు పెరగడంతో సంవత్సర కాలంగా సరఫరా చేయడంలేదు. సిమెంట్‌తోపాటు భవనానికి ఉపయోగించే స్టీల్ ధరలు కూడా భారీగా పెరిగాయి.
ఐదేళ్ల క్రితం టన్ను స్టీల్ ధర రూ.40 నుంచి 42వేలు ఉండగా ప్రస్తుతం రూ.59 నుంచి 60వేలు ఉంది. సుమారు 20వేల రూపాయలు ఈ ఐదేళ్లలో స్టీల్‌కు పెరిగింది. యూనిట్ కాస్ట్‌లో స్టీల్‌ను కొనుగోలు చేయడం కాంట్రాక్టర్‌లకు కష్టంగా మారింది. భవన నిర్మాణం చేసే మేస్త్రీలు, కూలీల ధరలు బాగా పెరిగాయి. డబుల్ బెడ్ రూం మొదలుపెట్టిన సమయంలో మేస్త్రీలు రూ.80 నుంచి 90వేల రూపాయలు తీసుకోగా ప్రస్తుతం లక్షా 80వేల నుంచి 2లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు. పెరిగిన ధరల వల్ల ప్రభుత్వం ఇచ్చే యూనిట్ కాస్ట్‌లో స్టీల్, సిమెంట్, మేస్త్రీలు, జీఎస్టీలకే సరిపోతోంది. ఇటుక, ఇసుక ఇతర వస్తువులకు బడ్జెట్‌లో సరిపోవడంలేదు. వీటితోపాటు ఎలక్ర్టికల్, ప్లంబింగ్ వస్తువులకు కూడా భారీగా ధరలు పెరిగాయి.
ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు
ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేయాలంటే కనీసం ఏడున్నర నుంచి 8లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుండడంతో చాలా మంది ముందుకు రావడంలేదు. టెండర్‌లు వేసిన కాంట్రాక్టర్‌లు వదులుకుంటున్నారు. నిర్మాణం మొదలుపెట్టిన కాంట్రాక్టర్‌లు వాటిని పూర్తిచేసేందుకు తిప్పలుపడుతున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల ద్వారా యూనిట్‌కాస్ట్ పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మాణం చేస్తున్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. జిల్లాలో పూర్తయిన ఇళ్లు కూడా ఇప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గంలో కొన్ని ఇళ్లు మినహా మిగతావి పంపిణీ చేయలేదు. ఇళ్లు తక్కువగా ఉండడం, లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ అర్బన్‌తోపాటు ఇతర నియోజకవర్గాల్లో పూర్తైన ఇళ్లను అర్హులకు కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా... ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, పైరవీలతో ఇప్పటి వరకు పంపిణీ చేయడంలేదు.
జిల్లాలో యూనిట్‌కాస్ట్ పెరగడం వల్ల నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తప్ప అవి పూర్తయ్యే పరిస్థితికనిపించడంలేదు. జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పర్యవేక్షిస్తున్న అధికారులు మాత్రం సిమెంట్, స్టీల్, మేస్త్రీల ధరలు పెరగడం వల్ల నిర్మాణంకు కాంట్రాక్టర్‌లు ముందుకు రావడంలేదు. మరికొంతమంది పనులు చేయకుండానే వదిలేస్తున్నట్లు సమాచారం.
Read Also: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Read Also: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త