Minister Indrakaran Reddy: నిర్మల్ నియోజకవర్గం ప్రగతిపథంలో పయనిస్తోందని, అన్ని రంగాల్లో విశేష ప్రగతితో నిర్మల్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తోందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో నిర్మల్ నియోజకవర్గ ప్రగతి నివేదికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుల్లెట్ బండిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశానికి వచ్చారు. 2014 నుంచి 2023 వరకు నిర్మల్ నియోజవర్గం అన్ని అంశాల్లో అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదని విమర్శించారు.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ పురోగమిస్తోందని, గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి ప్రాజెక్ట్ లతో అన్నదాతల కష్టాలు తీరాయని, పేదలకు కార్పోరేట్ స్థాయి విద్యా, వైద్యం అందుతున్నాయని కొనియాడారు. దళితుల అభ్యున్నతికి దళితబంధు, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
'రైతన్నకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదు'
పంట నష్టంపై బీజేపీ రాజకీయం చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు చేశారు. పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి పథకాలను అమలు చేస్తున్నారా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని మోదీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తున్న కేంద్రం.. తెలంగాణపై ఆది నుంచి కక్ష్యసాధిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ను కూడా టార్గెట్ చేశారని అన్నారు. పేపర్ లీకేజీలతో సీం కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. సిట్ కు ఆధారాలు సమర్పించాలని, లేదంటే నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమం'
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిరంతర కరెంట్ సరఫరాతో కరెంట్ రైతుల సాగునీటి కష్టాలు తీరాయని, రైతులు ఆర్థికంగా వృద్ది చెందాలని అన్నదాతల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, పండించిన పంటకు గిట్టుబాటు ధర, కోనుగోలు కేంద్రాల ద్వారా చివరి ధాన్యపు గింజను కొంటున్నామని మంత్రి అన్నారు. వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా ఫించన్లు, పేదింటి ఆడ బిడ్డల పెళ్ళిలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. విద్యా, ఆరోగ్యంలో గణనీయంగా అభివృద్ది సాధించామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల చెంతకు పాలన వచ్చిందన్నారు. ప్రతి మండల కేంద్రానికి రెండు వరుసల రహదారుల నిర్మాణంతో సాఫీగా ప్రయాణించగలుగుతున్నామన్నారు.