ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందుసేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఒకే రోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు అందించారు మంత్రి హరీష్‌. రైతులంటే సీఎం కేసీఆర్‌కు మక్కువ అని, వారికోసం ముఖ్యమంత్రి ఏదైనా చేస్తారని మంత్రి అన్నారు.  


బీజేపీ వాళ్లవన్నీ వంకర మాటలే- మంత్రి హరీష్‌ రావు


వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ ఎకరాకు రూ. 10 వేలు అందిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా తెలంగాణలో రైతులకు రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేశారు. బీజేపీ వాళ్లు మాట్లాడమంటే మస్తుగా మాట్లాడతారు, వాళ్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో రైతుకోసం ఏమైనా చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రైతుకు కేసీఆర్ కొండంత అండ అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ లాంటి పాలన కావాలని, సంక్షేమ పథకాలు కావాలని ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. ఛత్తీస్ గఢ్‌లో పంట కొనుగోలు చేయరని,  కేంద్రం మనపంట మరోసారి పంట కొనమని చేతులెత్తేసిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులు పండించే ప్రతి గింజ కొంటారని తెలిపారు. రైతులను కేసీఆర్ ఓదారిస్తే, బీజేపీ వాళ్ళు వంకర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నష్టపోయిన ఎకరానికి రూ. 10 వేలు చాలుతాయా అని సన్నాయి, నొక్కులు నొక్కతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు.


బీజేపీ కూడా రూ.10వేలు ఇస్తే ఎవరొద్దన్నారు?


రైతుల మీద మీకేమైనా ప్రేమ ఉంటే, కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వండని బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు మంత్రి హరీష్ రావు.  సీఎం కేసీఆర్ రూ. 10 వేలు ఇస్తున్నారు, మీరు రూ. 10 వేలు కేంద్రం నుంచి తీసుకురండి.. మొత్తం కలిపి రూ. 20 వేలు రైతులకు ఇద్దామని సూచించారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు. నల్లచట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీశారని హరీష్ రావు గుర్తుచేశారు.  కాళేశ్వరం నీళ్లు, కడుపునిండా నీళ్లు, 24 గంటల కరెంట్ లాంటి విధానాల వల్ల తెలంగాణలో యాసంగిలో 56 లక్షల వరి నాట్లు వేశారని తెలిపారు. ఆంధ్రలో యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారని అన్నారు. వ్యవసాయంలో తెలంగాణ రైతు గెలిచి నిలిచాడని హరీష్ రావు అన్నారు. యసంగిలో దేశం మొత్తంమీద 97 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే, ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలు సాగు అవుతున్నదని పేర్కొన్నారు.  శివుడి జటాజూటం నుంచి గంగమ్మ తల్లి పరుగులు పెట్టినట్లు, కాళేశ్వరం నీళ్లు తెలంగాణ రైతు భూముల్లోకి పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. నదికి కొత్త నడక నేర్పిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణలో ఒకనాడు భూమి అమ్ముదామంటే కొనేవాడు లేదు, ఇప్పుడు కొందామంటే అమ్మేడు లేడని స్పష్టం చేశారు. తెలంగాణలో నాట్లు వేయడానికి పక్క రాష్ట్రాల నుంచి కాదు, పక్కా దేశాల నుంచి కూలీలు వస్తున్నారని తెలిపారు.  తెలంగాణ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు అన్నం పెడుతున్నదని, కాంగ్రెస్, బీజేపీలవి మాటలు తప్ప చేతలు వుండవని హరీష్‌ రావు ఘాటుగా విమర్శించారు.