MLC Kavitha Press Meet at Telangana Bhavan | హైదరాబాద్: తెలంగాణ భూములను రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టిందని, నష్టం వస్తే భూముల భవితవ్యం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భూములను స్టాక్ మార్కెట్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత స్కెచ్ వేశారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. తన దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని కవిత స్పష్టం చేశారు.
టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు రహస్య జీవో
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోంది. భారీ మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా తలుపులు తెరిచారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు.
స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నష్టం వస్తే బాధ్యత ఎవరిది..
తెలంగాణ భూములను ప్రభుత్వం స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ? స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే ఆ జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటి ? రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణం. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గత 16 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. తెచ్చిన అప్పులతో ఏ ఒక్క స్కీమ్ కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారు. అలాగని ఆ నిధులకు అభివృద్ధికి కూడా వెచ్చించలేదు. తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మీ పథకం సైతం అమలు చేయలేదు.
తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
గతంలో చేసిన అప్పులకు కేవలం 80 వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. అయితే అప్పుగా తెచ్చిన 1.8 లక్షల కోట్లలో మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?. ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాం. లక్ష కోట్లను సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇది కచ్చితంగా 20 శాతం కమీషన్ సర్కార్. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి నేరుగా 20 శాతం కమీషన్ తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో దాదాపు 20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లింది. నేను చెప్పిన మాటలు తప్పయితే తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పులు, వాటిని వేటికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
బిల్లులు వారికి మాత్రమే వెళ్తున్నాయి..ఒక రాష్ట్ర మంత్రి సొంత కంపెనీకి, మెఘా కంపెనీకి మాత్రే సీఎం రేవంత్ రెడ్డి బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చేసిన అభివృద్ధి పనులకు కాదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చినా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క మంచి పని చేయలేదు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ 10 వేల కోట్లు అప్పు తెచ్చారు. చెట్లను, ప్రకృతిని నాశనం చేయాలని చూడగా.. యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, నేతలు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని’ ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.