Group clash between congress leaders in Presence of Bhatti Vikramarka: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాథ్ సే హాథ్ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మరోసారి కాంగ్రెస్ వర్గ పోరు బహిర్గతం అయింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావ్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వర్గం నేతల మధ్య వర్గపోరు ఉద్రిక్తతకు దారితిసింది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన హథ్ సే హథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 10వ రోజులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బహిర్గతమయింది. పాదయాత్ర అనంతరం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఒ ఫంక్షన్ హాల్ సమీపంలోని గ్రౌండ్ లో సభ ఎర్పాటు చేయగా.. భట్టి పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు.. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, వర్గ నేతలు ఒక్కసారిగా పోటాపోటీగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ వర్గానికి చెందిన వారు ఆసిఫాబాద్ అభ్యర్థి మర్సుకొల సరస్వతికి మద్దతుగా.. ప్రేమ్ సాగర్ రావ్ వర్గం నేతలు రాథోడ్ గణేష్ ని నాన్ లోకల్ అభ్యర్థి అని వ్యతిరేకిస్తున్నారు. ఆయన డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ని సభకు ఆహ్వానించలేదని, అగౌరవపరిచాడని ఆరోపిస్తూ పాదయాత్ర అనంతరం నిర్వహించే సభకు డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ వెళ్ళొద్దని ఆయన అనుచరులు అడ్డుగా వెళ్ళారు. దీంతో ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ వర్గపోరు స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో భట్టి విక్రమార్క ఇరు వర్గాలకి సర్ది చెప్పారు.
అనంతరం నిర్వహించిన సభలో ప్రేమ్ సాగర్ వర్గానికి చెందిన వారు స్టేజ్ పైన కూర్చోవడంతో విశ్వ ప్రసాద్ వర్గం నేతలు స్టేజ్ కింద కూర్చొని నిరసన తెలిపారు. సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy), భట్టి విక్రమార్కలు మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం మొదలు పెట్టిందే ఇక్కడ నుంచి.. ఇక్కడ చిల్లర రాజకీయాలు చేసిన వారికి చెబుతున్నా.. రానున్న రోజుల్లో తన అభ్యర్థిని నిలబెడతా అతన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని శపథం చేయడంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఘటన తనకు కన్నీళ్ళు తెప్పించిందని, ఆయన స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాట్లాడిన అనంతరం భావోద్వేగంతోనే స్టేజీ దిగి కిందకు వెళ్ళిపోయారు. ఆయన భావోద్వేగానికి గురికావడంతో ఆయన సతీమణి సభ ప్రాంగణంలో కన్నీరు పెట్టుకున్నారు. తన వాహనంలోకి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయారు.
అనంతరం భట్టి విక్రమార్క సర్ది చెప్పడంతో అందరూ ఏకమై మళ్ళీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావ్ నేతృత్వంలోనే ఈ పాదయాత్ర కొనసాగుతోంది. ఆయనే అన్ని తానై ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన వర్గపోరు రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలకు దారితీస్తాయోనని అందరు చర్చించుకుంటున్నారు.