Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ స్కామ్ లో ప్రధాన నిందితురాలు హీరా గోల్డ్ ఎంపీ నౌహీరా షేక్ చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హీరా సంస్థ, నౌహీరా షేక్ కు చెందిన 24 చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ 33.06 కోట్లు. గతంలో సుమారు రూ.367 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. హీరా గోల్డ్‌ రూ. ఐదు వేల కోట్ల స్కామ్ పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఎండీ నౌహీరా షేక్ మీద మొత్తం పది కేసులు నమోదు అయ్యాయి. ఈ స్కామ్ వల్ల దాదాపు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు తెలుస్తోంది. హీరా గోల్డ్ మనీలాండరింగ్‌ కేసులో నౌహీరా షేక్ ను 2018 అక్టోబర్ 16న ఈడీ అరెస్టు చేసింది.  


రూ.5 వేల కోట్ల స్కామ్ 


స్కీమ్ పేరుతో హీరా గోల్డ్ సంస్థ స్కామ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. కంపెనీ రూల్స్ ఉల్లంఘించి మోసాలకు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36 శాతం అధికంగా చెల్లిస్తామని చెప్పి దేశవ్యాప్తంగా లక్షల మంది వద్ద రూ. 5 వేల కోట్ల మేర వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నిధులను షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. దీంతో 2018లో మనీలాండరింగ్‌ చట్టం కింద హీరా గోల్డ్ సంస్థపై కేసు నమోదు చేసింది ఈడీ. ఎస్‌ఏ బిల్డర్‌ అండ్‌ డెవలపర్స్‌ ద్వారా హైదరాబాద్ టోలిచౌకిలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు రూ.148 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 70 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోల్‌కతా, షిల్లాంగ్‌లోని నీలాంచల్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు మరికొన్ని షెల్‌ కంపెనీలకు రూ.41 కోట్లు దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు.  


రియల్ ఎస్టేట్ సంస్థలకు స్థలాలు విక్రయం 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నౌహీరా షేక్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే పెట్టుబడుల పేరుతో రూ.5 వేల కోట్లు వసూలు చేసి ఇన్వెస్టర్స్ కు కుచ్చుటోపీ పెట్టినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు నౌహీరా షేక్ స్థలాలు అమ్మినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే షోలాపూర్ సత్వా సంస్థకు స్థలాలు అమ్మారు నౌహీరా. గత ఏడాది షోలాపూర్ సత్వా కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది.  షోలాపూర్ సత్వా, ఎస్ఏ బిల్డర్స్, నీలాంచల్ టెక్నో క్యాట్స్‌లో ఈడీ అక్రమాలు గుర్తించింది. గత ఏడాది షోలాపూర్ సత్వాకు చెందిన రూ.78 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది. పలు షెల్ కంపెనీలకు హీరా గోల్డో సంస్థ నుంచి నిధులు బదిలీ అయ్యారు. ఎస్ఏ బిల్డర్స్‌కి రూ.148 కోట్లు బదిలీ చేసినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. హీరా గోల్డ్ స్కాం కేసుకు సంబంధించి ఆ సంస్థ ఛైర్మన్ నౌహీరా షేక్‌కు 2021 సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ సంస్థ డేటాను ఉపయోగించుకొనేందుకు నౌహీరా షేక్ కు ఈ విషయమై సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. నౌహీరా షేక్ ను అరెస్ట్ చేసిన సమయంలో ఆ సంస్థకు చెందిన డేటాను నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.