COVID-19 Mock Drills:
పెరుగుతున్న కేసులు..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలనూ అలెర్ట్ చేసింది. మరోవైపు ఫ్లూ కేసులు కూడా పెరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఆ మేరకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది. ఏప్రిల్ 10,11 వ తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ICMR అధికారికంగా ప్రకటన చేశాయి. అన్ని జిల్లాల్లోని వైద్యాధికారులు అప్రమత్తం అవ్వాలని చెప్పింది. ఆసుపత్రుల్లో మందులు, పడకలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సరిపడా అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని వెల్లడించారు. ఫిబ్రవరి వరకూ దేశంలో కొవిడ్ అదుపులోనే ఉన్నప్పటికీ...ఆ తరవాత క్రమంగా కేసులు పెరుగుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ...కొవిడ్ వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని స్పష్టం చేశారు. కేసులు క్రమంగా పెరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇదే సమయంలో ఇన్‌ఫ్లుయెంజా కేసులపైనా దృష్టి పెట్టాలని సూచించారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ ఫ్లూ వ్యాప్తి పెరుగుతోందని హెచ్చరించారు. ఈ లేఖతో పాటు కొవిడ్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 27న అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
కొత్త మార్గదర్శకాలివే..
1. వెంటిలేషన్ తక్కువగా ఉన్న చోట పెద్ద ఎత్తున గుమిగూడకుండా జాగ్రత్త పడాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారి మరింత అప్రమత్తంగా ఉండాలి.
2.బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఖర్చీఫ్ వాడాలి.
3.చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్‌లో ఉమ్మివేయకూడదు. టెస్టింగ్ సంఖ్యను పెంచాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.
4.లక్షణాలు కనిపిస్తే ఎవరినీ కలవకుండా జాగ్రత్తపడాలి.
పంచ సూత్రాలు..
అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఇటీవలే ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. వీటితోపాటు కొవిడ్, ఇన్‌ఫ్లుయెంజా మందులు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవి తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి బాధితుల సంఖ్య పెరిగితే..అందుకు తగ్గట్టుగా పడకలు ఉన్నాయో లేదో ముందే జాగ్రత్త పడాలని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్లకుపైగా వ్యాక్సిన్‌లు అందించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
"ప్రస్తుతానికి హాస్పిటలైజేషన్ పెరుగుతున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ఏదేమైనా ప్రికాషనరీ డోస్‌లు తీసుకోవాలి. వీటి సంఖ్య పెంచాలి. టెస్టింగ్‌ల సంఖ్య కూడా పెంచాలి. ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలి"
- కేంద్ర ఆరోగ్య శాఖ
Also Read: ప్రధాని మోదీ నన్ను శూర్పణఖతో పోల్చి కించపరిచారు, ఆయనపై పరువు నష్టం దావా వేస్తా - రేణుకా చౌదరి