Surpanakha Remark:


పార్లమెంట్‌ సాక్షిగా..


రాహుల్‌పై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఈ నిర్ణయాన్ని ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం దావా వేయనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఇందుకు కారణమేంటో కూడా వివరించారు. పార్లమెంట్‌ సాక్షిగా మోదీ తనను రామాయణంలోని శూర్పణఖతో పోల్చారని చెప్పారు. ట్విటర్‌లో ఈ విషయం వెల్లడించారు. 2018లో పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోని షేర్ చేశారు. "రేణుకా చౌదరి నవ్వుని చూస్తే నాకు రామాయణంలోని ఓ పాత్ర గుర్తుకొస్తోంది" అంటూ మోదీ కామెంట్ చేసిన వీడియో పోస్ట్ చేశారు. 


"అధికార దాహంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా నన్ను శూర్పణఖతో పోల్చుతూ కించపరిచారు. ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నాను. చూద్దాం. కోర్టులు ఎంత త్వరగా స్పందిస్తాయో" 


- రేణుకా చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నేత 






ఇదీ జరిగింది..


2018 ఫిబ్రవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఆధార్ స్కీమ్‌పై చర్చించారు. 1998లో ఎల్‌కే అడ్వాణి హోం మంత్రిగా ఉన్నప్పుడే ఆధార్‌ తీసుకురావాలన్న ఆలోచనను ప్రస్తావించారని అన్నారు. ఇది విన్న వెంటనే రేణుకా చౌదరి గట్టిగా నవ్వారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెంటనే ఆమెను మందలించారు. వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. ఆమెను ఆపొద్దని వెంకయ్య నాయుడుకి సూచించారు. ఆ తరవాత సెటైర్‌లు వేశారు. "అప్పుడెప్పుడో రామాయణం సీరియల్‌లో ఇలాంటి నవ్వుని విన్నాం. అలాంటి నవ్వునే ఈ సభలో వినడం మనందరి అదృష్టం" అని అన్నారు.  ఆ తరవాత కేంద్ర మంత్రి అమిత్ మాల్వియా ఓ ట్వీట్ చేశారు. రామాయణం సీరియల్‌లో శూర్పణక నవ్విన వీడియో క్లిప్‌ని షేర్ చేశారు. "నాకు ఓ వ్యక్తి ఈ క్లిప్ పంపారు. ఇలాగే నవ్విన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరో గుర్తు పట్టగలరా..? ఇదో కాంటెస్ట్" అంటూ ట్వీట్ చేశారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ పెద్ద గొడవే చేసింది. ప్రస్తుతం రాహుల్‌పై అనర్హతా వేటు వేసిన నేపథ్యంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు రేణుకా చౌదరి. రాహుల్‌ గాంధీపై అనర్హతా వేటు వేయడం దేశవ్యాప్తంగా రాజకీయాలను వేడెక్కించాయి. కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాయి. బీజేపీ నియంతృత్వ నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులూ పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపడుతున్నాయి. 


Also Read: Rahul Gandhi Disqualification: ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు, రాహుల్‌పై అసోం సీఎం సెటైర్లు