Rahul Gandhi:



అదానీపై మాట్లాడినందుకే..


తనపై అనర్హతా వేటు పడిన తరవాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు రాహుల్ గాంధీ. మోదీ హయాంలో ప్రజాస్వామ్యంపై రోజూ దాడి జరుగుతూనే ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని AICC హెడ్‌క్వార్టర్స్‌లో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన..యూకే స్పీచ్‌పై కొందరు కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేశారని మండి పడ్డారు.  ప్రశ్నించడం ఆపేయను అని తేల్చి చెప్పిన రాహుల్...దేనికీ భయపడను అని స్పష్టం చేశారు. అదానీ అంశాన్ని ప్రస్తావించారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచి అదానీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అదానీ, మోదీ సంబంధంపై మాట్లాడినందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి ఎయిర్‌పోర్ట్‌లను గంపగుత్తగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందుకోసం నిబంధనలు కూడా అనుకూలంగా మార్చేశారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తూనే ఉంటాని తేల్చి చెప్పారు. అదానీకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఉద్దేశపూర్వకంగా తన ప్రసంగాలను రికార్డుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చే హక్కు ఉంటుందని, కానీ అందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని వెల్లడించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు రెండు లేఖలు రాసినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ తనపై అనర్హతా వేటు వేశారని ఆరోపించారు. ప్రధాని మోదీని కాపాడేందుకే ఇలా చేశారని అన్నారు. ఇది ఓబీసీ వ్యవహారం కాదని, కేవలం తాను అదానీ గురించి ప్రశ్నించినందుకే అనర్హత వేటు వేశారని చెప్పారు. లండన్‌లో దేశానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. 


జైల్లో పెట్టినా పోరాటం చేస్తా...


కోర్టు తీర్పుపై స్పందించను అని తేల్చి చెప్పిన రాహుల్...నిజం మాట్లాడడం తన నైజం అని వెల్లడించారు. తనపై అనర్హతా వేటు వేసినా, చివరకు అరెస్ట్ చేసినా సరే నిజం వైపే నిలబడతానని వెల్లడించారు. ఈ దేశం తనకు అన్నీ ఇచ్చిందని, అందుకే ఈ పోరాటం చేస్తున్నానని అన్నారు. అదానీ వ్యవహారంపై తన ప్రసంగాన్ని విని ప్రధాని మోదీ భయపడ్డారని, ఆయన కళ్లలోనూ ఆ భయం కనిపించిందని తెలిపారు రాహుల్. అందుకే ముందు ఈ వ్యవహారం నుంచి దృష్టి మరల్చారని, ఆ తరవాత తనపై అనర్హతా వేటు వేశారని మండి పడ్డారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినప్పటికీ పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు.  పార్లమెంట్‌లో ఉన్నా లేకున్నా...తన పని తాను చేస్తానని స్పష్టం చేశారు. అదానీ అవినీతి పరుడన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయిందని, అలాంటి వ్యక్తిని ప్రధాని కాపాడాలని చూస్తున్నారని ఆరోపించారు. అదానీ గురించి మాట్లాడితే దేశంపై దాడి చేస్తున్నారని తప్పుదోవ పట్టిస్తున్నారి అసహనం వ్యక్తం చేశారు. దీనర్థం...అదానీయే దేశం అనా..? అని ప్రశ్నించారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ప్రస్తుతానికి కోర్టు తీర్పుపై స్పందించనని చెప్పారు. అదానీ వ్యవహారంపై సమాధానం చెప్పలేకే తనపై అనర్హతా వేటు వేశారని అన్న రాహుల్...ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టేంత వరకూ విపక్షాలు వెనక్కి తగ్గవు అని తేల్చి చెప్పారు. దేశంలోని వ్యవస్థలు, పేద ప్రజలు తరపున పోరాటం చేయడమే తన విధి అని అన్న రాహుల్...నిజాలు చెప్పడం తన బాధ్యత అని చెప్పారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. విపక్షాలతో కలిసి పోరాడేందుకు సిద్ధమేనని అన్నారు. 


Also Read: Karnataka Elections 2023: ఎలక్షన్ ఫైట్‌కు సిద్ధమైన కాంగ్రెస్, అభ్యర్థుల పేర్లు ఖరారు