Karnataka Elections 2023:


కర్ణాటక ఎన్నికలు..


మరో రెండు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ యాక్టివ్ అయ్యాయి. ఎలక్షన్స్‌కు రెడీ అయిపోతున్నాయి. బీజేపీ కన్నా ఓ అడుగు ముందే ఉంది కాంగ్రెస్. అప్పుడే అభ్యర్థుల జాబితానూ విడుదల చేసింది. 124 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్‌ ప్రకటించకపోయినప్పటికీ కాంగ్రెస్ ముందస్తుగా సిద్ధమవుతోంది. ఈ ఏడాది మే 24తో అసెంబ్లీ గడువు ముగిసిపోనుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరు కూడా ఉంది. ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌కి కూడా అవకాశమిచ్చింది అధిష్ఠానం. కనకపుర నియోజకవర్గం నుంచి శివకుమార్ పోటీ చేయనున్నారు. వరుణ నియోజకవర్గం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఆ సీటు కేటాయించింది కాంగ్రెస్. అయితే...సిద్దరామయ్యను మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బదామి, వరుణ, కోలార్‌ నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట పోటీ చేయాలనుకుంటున్నట్టు గతంలోనే సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే కోలార్ జిల్లా నుంచి కూడా ఆయనను ఎన్నికల బరిలోకి దింపనున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే రెండు చోట్ల పోటీ చేశారు. ఈ లిస్ట్‌లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశమిచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది.