Issy Wong Hattrick: ముంబై వేదికగా జరుగుతున్న తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో  ముంబై ఇండియన్స్  బౌలర్ ఇసీ వాంగ్ చరిత్ర సృష్టించింది. ఈ లీగ్ లో తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర పుటల్లోకెక్కింది.  శుక్రవారం  యూపీ వారియర్స్‌ను ముంబై చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర  పోషించింది. ఈ లీగ్  ప్రారంభం నుంచి తన బౌలింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్న వాంగ్ ఎవరు..?  ఆమె నేపథ్యం ఏమిటి..? రెండో ప్రపంచ యుద్ధంతో  ఆమెకు ఏంటి సంబంధం..? రూబిక్స్ క్యూబిక్ ‌ను  33 సెకన్లలో  సాల్వ్ చేసిన  వాంగ్ గురించి ఆసక్తికర విషయాలివిగో.. 


ఇదీ ఇసీ కథ.. 


ఇసాబెల్లె ఎలనర్  చి మింగ్ వాంగ్..  షార్ట్ గా చెప్పాలంటే ఇసీ వాంగ్.   2002 మే 15న చెల్సియా (లండన్) లో జన్మించిన వాంగ్  పూర్వీకులది హాంకాంగ్.   ఆమె తల్లి పేరు రాచెల్. తండ్రి డామ్ వాంగ్.  వాంగ్ తల్లి   ఒక ఫ్రీలాన్స్ రైటర్. ఆమె ఇంగ్లీష్ పత్రికలకు క్రికెట్ గురించి  ఆర్టికల్స్ రాసేది. వాంగ్  మేనమామలిద్దరూ హంకాంగ్ జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడారు. వీరిలో డొనాల్డ్ ఆండర్సన్ అనే వ్యక్తి .. హాంకాంగ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసావాడు. హాంకాంగ్ యుద్ధం లో ఆయనను జపాన్ గూఢాచారి ఒకరు తుపాకీతో కాల్చి చంపాడు. డొనాల్డ్ మరణం తర్వాత వాంగ్ ముత్తాత కుటుంబం..  హాంకాంగ్ నుంచి దక్షిణ చైనా ప్రాంతానికి తరలివెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా  రాచెల్ తల్లి వాళ్ల నాన్నమ్మ ఫిలిస్ నొలస్కొ డ సిల్వ..  బ్రిటిష్  మిలిటరీ ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసింది. అందుకు గాను   ఆమెకు బ్రిటీష్ హయ్యస్ట్ సివిలియన్ వార్ అవార్డు కూడా వచ్చింది.  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీరి కుటుంబం  లండన్ కు తరలివెళ్లింది.  


ఎనిమిదేండ్లకే క్రికెట్.. 


పూర్వీకుల రక్తమో.. అమ్మ  రాసిన క్రికెట్ ఆర్టికల్స్ ప్రభావమో గానీ వాంగ్ కు చిన్నప్పట్నుంచే  ఈ ఆట మీద ఆసక్తి పెరిగింది.  ఆమె ఐదేండ్ల వయసులోనే వాంగ్ కుటుంబం లండన్ నుంచి   వార్క్‌విక్‌షైర్ కు  తరళివెళ్లింది. తన స్కూల్ లో ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా   అక్కడ నిర్వహించిన స్కూల్ క్రికెట్ క్యాంప్ లో ఉత్సాహంగా  పాల్గొనేది.  మొత్తం ఈ గ్రూప్ లో 50 మంది ఉంటే  ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు.  ఆ ఇద్దరిలో వాంగ్ ఒకరు.  ఎనిమిదేండ్ల వయసులోనే వాంగ్.. నోల్ అండ్ డారిడ్జ్ క్రికెట్ క్లబ్ లో చేరింది.   తన ఆల్  రౌండ్ ప్రతిభతో  వార్క్‌విక్‌షైర్ అండర్ -11 జట్టుకు ఎంపికైంది.  2018లో ఆమె ఈ టీమ్ తరఫున  స్థానికంగా నిర్వహించిన టీ20 ఛాంపియన్షిప్ లో ఆడి  అదరగొట్టింది.  


 






ఇంగ్లాండ్  జాతీయ జట్టు ఎంట్రీ.. 


వార్క్‌విక్‌షైర్  తరఫున  నిలకడగా రాణిస్తున్న ఆమె  ఇంగ్లాండ్ జాతీయ  జట్టు సెలక్టర్ల దృష్టిలో పడింది.  2018లో  స్థానికంగా నిర్వహించిన టోర్నీలలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో వాంగ్.. 2019-20 సీజన్ లో  ఇంగ్లాండ్ జాతీయ  క్రికెట్ అకాడమీకి ఎంపికైంది. 2021లో  రాచెల్ హేహో  ఫ్లింట్ ట్రోఫీలో 11 వికెట్లు తీసింది.  దీంతో అదే ఏడాది డిసెంబర్ లో  ఇంగ్లాండ్ - ఎ టీమ్ కు సెలక్ట్ అయింది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ది హండ్రెడ్  (ఇంగ్లాండ్) లలో కూడా మెరిసింది. గతేడాది  సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే, టీ20 లలో ఎంట్రీ ఇచ్చింది.  ఇప్పటివరకు   9 టీ20లలో 7 వికెట్లు తీసింది.  


మరికొంత.. 


- క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా ఇష్టం.  ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో ఆడే లివర్‌పూల్ ఫుట్‌బాల్ టీమ్ కు వీరాభిమాని. 
-   రూబిక్స్ క్యూబిక్ ను ఒక క్రమ పద్ధతిలో  పెట్టడానికి మనం  గంటలకు గంటలు  కూర్చుంటాం. కానీ  2019 వన్డే వరల్డ్ కప్ (మహిళల)  ఫైనల్స్  మ్యాచ్ కు ముందు ఆమె (అప్పుడు ఇంగ్లాండ్  జట్టులో ఉంది)  33 సెకన్లలోనే దానిని సాల్వ్ చేసింది. 
- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇసీ వాంగ్ ను ముంబై ఇండియన్స్.. 30 లక్షల బేస్ ప్రైస్ తో కొనుగోలు చేసింది. ఇప్పటివరకూ ఈ లీగ్ లో  9 మ్యాచ్ లు ఆడిన వాంగ్..  12 వికెట్లు తీసింది. అత్యధిక వికెట్లు తీసిన  బౌలర్ల జాబితాలో టాప్ - 5 లో ఉంది.