Mumbai Indians Women vs UP Warriorz, Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 182 పరుగులు చేసింది. అనంతరం యూపీ వారియర్జ్ 17.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 72 పరుగులతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ముంబై ఇండియన్స్ తరఫున ఆల్ రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో ఓడిన యూపీ ఇంటి బాట పట్టింది.
హ్యాట్రిక్‌తో చెలరేగిన ఇసీ
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఓపెనర్లు అలిస్సా హీలీ (11: 6 బంతుల్లో, రెండు ఫోర్లు), శ్వేతా సెహ్రావత్ (1: 8 బంతుల్లో) దారుణంగా విఫలం అయ్యారు. టహ్లియా మెక్‌గ్రాత్ (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) కూడా త్వరగా అవుట్ కావడంతో యూపీ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే (43: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), గ్రేస్ హారిస్ (14: 12 బంతుల్లో, మూడు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరు జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలు దాటించారు. నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించిన అనంతరం గ్రేస్ హారిస్‌ను అవుట్ చేసి నాట్ స్కివర్ బ్రంట్ ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. అయినా మరోవైపు కిరణ్ జోరు ఏమాత్రం ఆగలేదు. ముంబై బౌలర్లపై ఎదురు దాడికి దిగి పరుగులు రాబడుతూనే ఉంది.
ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇసీ వాంగ్ యూపీని చావు దెబ్బ తీసింది. రెండో బంతికి వేగంగా ఆడుతున్న కిరణ్ నవ్‌గిరేను అవుట్ చేసిన ఇసీ, మూడో బంతికి సిమ్రన్ షేక్ (0: 1 బంతి), నాలుగో బంతికి సోఫీ ఎకిల్‌స్టోన్‌లను (0: 1 బంతి) క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించింది. దీంతో యూపీ 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత యూపీ లోయర్ ఆర్డర్‌ను ముంబై త్వరగా పెవిలియన్‌కు పంపేసింది. దీంతో యూపీ 17.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. ఇసీ వాంగ్ నాలుగు వికెట్లు తీసింది. సైకా ఇషాక్‌కు రెండు వికెట్లు దక్కాయి. నాట్ స్కివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్, జింతిమణిలు ఒక్కో వికెట్ పడగొట్టారు.
నాట్ స్కివర్ షో
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యాస్తిక భాటియా (21: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు) యూపీ బౌలర్లపై మొదటి బంతి నుంచి విరుచుకుపడింది. కానీ నాలుగో ఓవర్లో అంజలి శర్వాణి యాస్తికను అవుట్ చేసి యూపీకి మొదటి వికెట్ అందించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడింది.
కాసేపటికి మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (26: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) అవుట్ అయింది. తన స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14: 15 బంతుల్లో, ఒక ఫోర్) కూడా కీలక మ్యాచ్‌లో ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. కానీ మరో ఎండ్‌లో నాట్ స్కివర్ బ్రంట్ మాత్రం ఊచ కోత ఆపలేదు. హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాత వచ్చిన మెలీ కెర్ (29: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు) బ్రంట్‌కు చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. ఆఖర్లో మెలీ కెర్ అవుటైనా పూజా వస్త్రాకర్ (11 నాటౌట్: 4 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) విలువైన పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. పార్శవి చోప్రా, అంజలి శర్వాణిలకు చెరో వికెట్ దక్కాయి.