సమ్మర్ వచ్చేసింది . రకరకాల టూర్ ప్యాకేజీ లు అనౌన్స్ అవుతున్నాయి. సెలవుల్లో సరదాగా విహార ప్రాంతాలకు వెళ్లే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి హాలిడే ట్రిప్స్ కి ఎక్కువగా టూరిస్టులు వెళుతున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయి . వీటిని దృష్టిలో పెట్టుకొని IRCTC సమ్మర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
వైజాగ్ టూ కశ్మీర్ టూర్
స్మార్ట్ సిటీ వైజాగ్ నుంచి భూతల స్వర్గం కశ్మీర్ కు 6 రోజులు ( 6 పగళ్లు - 5 రాత్రులు ) టూర్ ను హెవెన్ ఆన్ ఎర్త్ పేరు మీద అనౌన్స్ చేసింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ (IRCTC ). ఏప్రిల్ 14న వైజాగ్ లో ప్రారంభమయ్యే ఈ టూర్ 19 వ తేదీన వైజాగ్ లో ముగుస్తుంది . ఇండిగో ఎయిర్ లైన్స్ ఎకానమీ క్లాస్ లో ఈ ప్రయాణం సాగుతుంది. రాత్రివేళల్లో 3 స్టార్ హోటళ్లలో స్టే ఉంటుంది . విశాఖ లో ఎయిర్ పోర్ట్ పికప్ ,డ్రాపింగ్ ,సైట్ సీయింగ్ ,ఉదయం బ్రేక్ ఫాస్ట్ ,నైట్ డిన్నర్ ,ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్ అంతా ప్యాకేజీ లోనే భాగం అని IRCTC ప్రతినిధులు చెబుతున్నారు .
టూర్ లో కవరయ్యే ప్రాంతాలు ఇవే
కశ్మీర్ టూర్ లో గుల్మార్గా లో గొండోలా పాయింట్ , సోనామార్గ్ లో గ్లాసియర్ , పెహల్గామ్ లోని మినీ స్విట్జర్లాండ్ , కుంకుమ పువ్వు తోటలు , చారిత్రిక అవంతి పుర నిర్మాణ శిధిలాలు , శ్రీనగర్ లోని డాల్ లేక్ లో పడవ రైడ్ , మొఘల్ గార్డెన్స్ , షాలిమార్ గార్డెన్స్, పారిమహల్ లాంటి టూరిస్ట్ ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి అని IRCTC చెబుతోంది .
ప్యాకేజీ ధరలు ఎంతంటే ?
ఈ 6 రోజుల కాశ్మీర్ టూర్ కి ( సింగిల్ ఆక్యుపెన్సీ ) అయితే రూ62, 660 , డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ,47,480, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.46,555 (GST ,ఇతర టాక్స్ లు సహా ) ఛార్జ్ ఫిక్స్ చేశారు.
ఎవరిని సంప్రదించాలి ?
ఈ టూర్ కి సంబంధించిన ఇతర వివరాల కోసం వైజాగ్ రైల్వే స్టేషన్ లో మెయిన్ గేట్ వద్ద ఉన్న IRCTC కౌంటర్ లో గానీ , లేదా వారి ప్రతినిధులను సంప్రదించవచ్చు అని IRCTC అధికారి చంద్రమోహన్ అంటున్నారు.