Sri Rama Navami Talambralu : భద్రాచలం, ఒంటిమిట్ట శ్రీరామనవమి కళ్యాణోత్యవాలకు గత పన్నెండేళ్లుగా యజ్ఞంగా చేపట్టిన కోటి తలంబ్రాలు పంపిణీ ఈ ఏడాదికి కూడా దిగ్విజయంగా పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాచలం, ఒంటిమిట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ప్రత్యేక వ్యవసాయ క్షేత్రంలో పండిస్తారు. ఆ ధాన్యాన్ని గోటితో ఒలిపించి అలా కోటి తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్టలోని సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధం చేస్తారు. ఈ సంప్రదాయం గత 12 ఏళ్లుగా జరుగుతుండగా ఈ ఏడాది జరగబోయే సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధం చేసిన కోటి గోటి తలంబ్రాలను ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన శుభకలశాలల్లో భద్రపరిచి వాటిని భద్రాచలం, ఒంటిమిట్ట పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వేదపండితులు తెలిపారు. ఈ క్రతువును రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద హోమాలు నిర్వహించి రామనామస్మరణల మధ్య వీటిని సిద్ధం చేశారు.
గోటితో ఒలిచిన తలంబ్రాలు చాలా ప్రత్యేకం
ప్రతీఏటా భద్రాచలం, ఒంటిమిట్ట శ్రీరామనవమి కళ్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను వినియోగిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలని గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో సర్వే నెం. 16 బై 2 సర్వే నెంబర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తలంబ్రాల కోసం పంటను పండిస్తున్నారు. వీటికి ఎటువంటి రసాయన ఎరువులు వినియోగించకుండా పంట పండిరచడం విశేషం. అదేవిధంగా ఈ పంటకోసం విత్తనాలను భద్రాచలం, ఒంటిమిట్ట సీతరాముల సన్నిధిలో ఉంచి వాటిని తీసుకొచ్చి సేద్యం చేస్తున్నారు. పంటను కూడా చాలా నిష్టగా పండించి ఆ తరువాత సీతారామనామస్మరణల మధ్య పంటను కోసి, ఒబ్బిడి చేస్తారు. ఆ తరువాత వీటిని నాలుగు రాష్ట్రాల్లోని 3000 మంది భక్తులకు పంపించి వాటిని రామనామస్మరణ చేస్తూ ఒలిపిస్తారు. అలా ఒలిచిన కోటి తలంబ్రాలను శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణోత్సంలో తలంబ్రాలుగా వినియోగిస్తున్నారు.
తలంబ్రాల ప్రత్యేకత
శ్రీరామ నవమి వచ్చిందంటే భద్రాచలం రామనామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ ఏడాది మార్చి 30న శ్రీరామ నవమి జరగనుంది. అయితే సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి తయారు చేయడం దగ్గర నుంచి భద్రాచలం చేరుకునే వరకు ఎంతో భక్తి ఉంది. జానకి దోసిట కెంపుల బ్రోవై, రాముని దోసిట నీలపు రాశై, ఆణిముత్యలే తలంబ్రాలుగా అని శ్రీరామనవమి నాడు రాములోరి కళ్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా వివరిస్తుంటారు. అయితే అలాంటి కోటి తలంబ్రాలను స్వయంగా గోటితోనే ఒలుస్తారు భక్తులు. కొన్నేళ్లుగా ఇదే ఆనవాయితీగా కొనసాగుతుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం నుంచి ఈ తలంబ్రాలు తెలంగాణలోని భద్రాచలానికి, ఏపీలోని ఒంటిమిట్టకు చేరుకుంటాయి. సీతారాముల కళ్యాణానికి శచీదేవి, అహల్య ఇలా కొంతమంది శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని పురణాలు చెబుతున్నాయి. ఇదే స్ఫూర్తిగా తూర్పు గోదావరి జిల్లా వాసులు రాములోరికి గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపిస్తారు. వరుసగా 12వ సారి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాద్రి, ఒంటిమిట్టకు పంపించారు.