Rahul Gandhi Disqualification:



కాంగ్రెస్ ఫైర్..


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దేనికీ భయపడమని, మౌనంగా ఉండమని స్పష్టం చేసింది. చట్ట పరంగా, రాజకీయంగా కచ్చితంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేశ్‌ తేల్చి చెప్పారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. 


"న్యాయపరంగానే కాదు. రాజకీయంగానూ పోరాటం చేస్తాం. ఏ మాత్రం భయపడం. మౌనంగా ఉండం. అదానీ స్కామ్‌పై కమిటీ వేయాలని మేం డిమాండ్ చేస్తుంటే అది పక్కన పెట్టి రాహుల్‌పై అనర్హతా వేటు వేశారు. ప్రజాస్వామ్యమా...ఓ శాంతి"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 






కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా దీనిపై స్పందించారు. కచ్చితంగా పోరాడం కొనసాగుతుందని తెలిపారు. 


"రాహుల్‌పై అనర్హతా వేటు వేసేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నించింది. నిజాలు మాట్లాడే వాళ్లు ఉండటం ఆ పార్టీకి నచ్చదు. కానీ మేం ఇకపైన కూడా నిజాలే మాట్లాడతాం. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌ను వినిపిస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమై. ఇకపై ఏం చేయాలన్నది అంతర్గతంగా చర్చించుకుంటాం. ఆ మేరకు వ్యూహాలు అమలు చేస్తాం. "


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 






ఎప్పుడైతే రాహుల్ గాంధీ అదానీ అంశం మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఆయనపై కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నియంతృత్వానికి ఇదో ఉదాహరణ అని మండి పడ్డారు. 


"ప్రధాని, అదానిపై రాహుల్ ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచి రాహుల్‌పై కుట్ర జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు వేయడం అప్రజాస్వామికం. బీజేపీ నియంతృత్వ వైఖరికి ఇదే నిదర్శనం"


- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ