తమిళ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో 'విజయ్ దళపతి' ఒకరు. ఆయన నటించిన 'వారసుడు' సినిమా రీసెంట్ గా పలు భాషల్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'లియో' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. 56 రోజుల లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ముగియడంతో.. మేకర్స్ ఓ కాశ్మీర్ లో జరిగిన షూటింగ్ కు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎన్నో రిస్క్ లు చేయాలి. అవసరమైతే స్టంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ప్రేక్షకుల కోసం, వారి మెప్పు కోసం సినిమాకు లింకైన ప్రతి ఒక్కరూ పగలనక, రాత్రనక ఎంతో కష్టపడుతుంటారు. అదే తరహాలో దళపతి విజయ్ మూవీ టీం కూడా సినిమా షూటింగ్ కోసం గడ్డకట్టే చలిలో పనిచేసింది. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని డిష్‌వాషర్‌ల నుండి లైట్‌మెన్, కెమెరా సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ -10 నుంచి -2 డిగ్రీల టెంపరేచర్ లో పనిచేయాల్సి వచ్చిందటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. మొత్తం 500 మంది సభ్యులతో కాశ్మీర్ వెళ్లిన తారాగణం చలికి వణికిపోతూనే షూటింగ్ వర్క్ కొనసాగించారు. రాత్రి, పగలు షూటింగ్ కొనసాగిస్తూ... ముఖ్యంగా అక్కడి చలి, మంచు, వర్షానికి ఏమాత్రం ఆగిపోకుండా షూటింగ్ ను సజావుగా ముగించారు. మారుతున్న వాతావరణానికి తట్టుకొని దాదాపు 2 నెలలు కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాల్లో ‘లియో’ చిత్రాన్ని చిత్రీకరించి, ఇటీవలే చెన్నై చేరుకున్నారు. 


కాశ్మీర్ లో 'లియో' మూవీ షూటింగ్ సమయంలో కొందరికి అక్కడి వాతావరణం పడక ఆసుపత్రి పాలయినట్టు తెలుస్తోంది. హిమపాతాలు వచ్చినా.. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినా.. మూవీ టీం కలసికట్టుగా.. పనిచేసినందుకు ప్రోత్సహించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ పై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పనిని చేయాలంటే కేవలం కష్టం మాత్రమే సరిపోదు.. కొన్నిసార్లు ఓపిక కూడా కావాలని డైరెక్టర్ నిరూపించారని అంటున్నారు.


ఈ నేపథ్యంలో 'లియో' మూవీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ డైరెక్టర్ కనగరాజ్ 7 నిమిషాల నిడివి గల ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా తమకు సంతోషంగానే అనిపించిందని ఈ వీడియోలో కొందరు సిబ్బంది తమ అనుభూతిని పంచుకున్నారు. షూటింగ్ లో సిబ్బంది ఎదుర్కొన్న సవాళ్లను సైతం వారు ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఆద్యంతం కట్టిపడేలా ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోను వీక్షించిన విజయ్ ఫ్యాన్స్ మరింత గర్వంగా ఫీలవుతున్నారు.






‘లియో’  చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు... ఇప్పటికే విజయ్ తో ‘మాస్టర్’ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. దీంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.400కు పైగా జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా.. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023  అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా 'లియో' రిలీజ్ కాబోతుండడంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



Also Read :  హిందూపూర్ వెళ్ళడానికి ముందు - అమ్మాయి నిష్కతో తారక రత్న, చివరి వీడియో ఇదేనా?